సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ జాబితా..! | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ జాబితా..!

Published Tue, Feb 13 2018 3:28 AM

Congress list in social media ..! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా సోషల్‌ మీడియాలో సోమవారం హల్‌చల్‌ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతల పేర్లు, వారి స్థానాలు.. రేవంత్‌రెడ్డితో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నేతలు, మరికొందరు ఆశావహుల పేర్లున్న జాబితా టీపీసీసీ వర్గాల్లో కలకలం సృష్టించింది.

దీంతో సోషల్‌ మీడియాలోని జాబితాకు, పార్టీకి సంబంధం లేదని ఉత్తమ్‌ స్వయంగా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ‘పార్టీ అభ్యర్థులంటూ సోషల్‌ మీడియాలో చూపిస్తున్న జాబితాకు, పార్టీకి సంబంధం లేదు. అధిష్టానం ఎలాంటి జాబితా విడుదల చేయలేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కావొద్దు’అని ఉత్తమ్‌ పేరిట పార్టీ వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.  

60 స్థానాలు.. 66 పేర్లు
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన జాబితాలో 60 స్థానాలకు 66 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. పీఏసీ చైర్మన్‌ గీతారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీల స్థానాల్లో వారి పేర్లతో పాటు మరో పేరూ ఉంది. కరీంనగర్, వేములవాడ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానాలకూ రెండు పేర్లు సూచించారు. కాగా, జాబితాను కాంగ్రెస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీనే విడుదల చేస్తుందని, కాంగ్రెస్‌ నేతలు, కేడర్‌ను గందరగోళ పరిచేందుకే జాబితా సృష్టించారని పార్టీ నేతలు అంటున్నారు.

Advertisement
Advertisement