టీఆర్‌ఎస్‌ పాలనలో హత్యల తెలంగాణ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పాలనలో హత్యల తెలంగాణ

Published Fri, Sep 28 2018 1:48 AM

Dasoju sravan commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణగా రూపుదిద్దుతామని చెప్పిన టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం హత్యల తెలంగాణగా మారిందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శిం చారు. విచ్చలవిడిగా నేరస్తులు కత్తులతో స్వైర విహా రం చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు నిస్తేజంగా వ్యవహరించడం దారుణమన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు గులాబీ పార్టీకి గులామ్‌లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

మిర్యాలగూడలో ప్రణయ్, అత్తాపూర్‌లో రమేశ్‌పై దాడులు చేసి చంపినా, ఎర్రగడ్డలో హత్యాయత్నాలు జరిగినా పోలీసుల యంత్రాంగం పసిగట్టే పరిస్థితిలో లేకపోవడం దారుణమన్నారు. నేషనల్‌ క్రైం బ్యూర్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నివేదిక ప్రకారం.. నేరాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలవడం సిగ్గుచేటన్నారు. నేరాలను పసిగట్టాల్సిన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ.. ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయాలన్న దానిపై సీఎంకు సమాచారం చేరవేయడంలో నిమగ్నమైందన్నారు.

సీఎం చేపట్టిన 11 సర్వేలకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను వాడుకున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ రాజకీయ శిక్షణా తరగతులకు పోలీస్‌ బాస్‌ హాజరయ్యారని, ఒక రాజకీయ పార్టీ శిక్షణ కార్యక్రమంలో పోలీసు బాసులు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు.

అక్రమ కేసులు బనాయిస్తున్నారు..
తెలంగాణ రాష్ట్రాన్ని పోలీస్‌ రాజ్యంగా మారుస్తున్నారని శ్రవణ్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భిక్షమయ్యగౌడ్‌లపై అక్రమ కేసులు బనాయించారని.. ఇటు రేవంత్‌రెడ్డి, క్రిషాంక్‌ లాంటి నేతలను అదేవిధంగా అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీల లేఖలతో ఇష్టారాజ్యంగా పోలీసులను బదిలీలు చేశారని విమర్శించారు. ఇటీవల జరిగిన పోలీసు బదిలీలన్నీ రాజకీయ పోస్టింగ్‌లేనని.. తక్షణమే ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని కేసీఆర్‌ చేతిలో బందీ అయిన పోలీస్‌ వ్యవస్థకు విముక్తి కలిగించాలని డిమాండ్‌ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement