అది అపహాస్యహారం! | Sakshi
Sakshi News home page

అది అపహాస్యహారం!

Published Tue, Oct 31 2017 2:45 AM

Dk aruna comments on haritha haram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హరితహారం అపహాస్యహారంగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలు డీకే అరుణ విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదని.. అసలు కరీంనగర్‌లో సీఎంనాటిన మొక్కనే రక్షించలేని దుస్థితి ఉంటే.. మిగతా మొక్కలు ఎలా బతికి ఉంటాయని నిలదీశారు. హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్‌ తరఫున డీకే అరుణ మాట్లాడారు. ‘‘ఐదేళ్లలో 231 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24శాతం నుంచి 33 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇప్పటివరకు నాటిన మొక్కలు 81 కోట్లని అధికారుల లెక్కలే చెబుతున్నాయి.

ఇంకా ఏడాదిన్నరలో మిగతా మొక్కలు నాటడం సాధ్యమా? నాటిన మొక్కల్లో 91 శాతం బతికాయని మంత్రి చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రజలను సంసిద్ధులను చేయకుండా వందల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న హరితహారం అపహాస్యహారంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమేనని నిరూపించేందుకు అధికారపక్షం సిద్ధంగా ఉందా?..’’అని నిలదీశారు.  

అంతా కాగితాలపైనే..! 
పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నంత మాత్రాన పథకాలు విజయవంతం అవుతాయనుకుంటే పొరపాటేనని, హరితహారం విషయంలో ప్రభుత్వం ఇదే చేస్తోందని డీకే అరుణ విమర్శించారు. మొక్కలను రక్షించేందుకు ఉద్దేశించిన గ్రీన్‌ బ్రిగేడ్‌ కాగితాలకే పరిమితమైందన్నారు. హైదరాబాద్‌లో నాలుగు గోడల మధ్య కూర్చుని అంకెలు సిద్ధం చేస్తే పథకం విజయవంతమైనట్టేనా? అని ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ, కాళేశ్వరం, పాలమూరులాంటి ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల అటవీ భూమిని వినియోగిస్తుండడంతో.. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయ చర్యలేమిటని నిలదీశారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం జరిగిన ఖర్చుపై సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) జరిగి ఉంటే సభ్యులకు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. 

ఖర్చు వివరాలు సభ ముందు పెట్టండి 
హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం బతికే ఉన్నాయని అటవీ శాఖ మంత్రి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటినట్టు పేర్కొన్నారని.. తన నియోజకవర్గంలో అన్ని మొక్కలు ఎక్కడ నాటారో చూపాలని ప్రశ్నించారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని.. ‘ఆ లెక్కలు జీహెచ్‌ఎంసీ వెలుపలివి. జీహెచ్‌ఎంసీ లెక్కలు వేరే ఉన్నాయి. ఇచ్చిన కాగితాలు సరిగా చదవకుండా మాట్లాడితే ఎలా?’అని ప్రశ్నించారు. హరితహారానికి రూ.2,008 కోట్లు ఖర్చయినట్టు వివరాలు సభ ముందుంచాలన్నారు.

మామూలు మొక్కలే నాటుతున్నారు 
హరితహారంలో పెళుసుగా ఉండే మొక్కలే నాటుతున్నారని, వాటి బదులు గట్టివైన రావి, చింత, వేప, మామిడి లాంటి రకాలను నాటా లని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య సూచించారు. తొందరగా పెరగాలన్న లక్ష్యంతో మామూలు మొక్కలను నాటుతున్నారని, నీటి ఎద్దడిని తట్టుకోగలిగే మొక్కలను నాటితేనే హరితహారానికి అర్థముంటుందని స్పష్టం చేశారు. వన్యప్రాణి చట్టం తరహాలో మొక్కలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు అవసరమన్నారు.  

సలహా సంఘాన్ని వేయండి: అక్బరుద్దీన్‌ 
హరితహారం పథకం అమలు తీరు పరిశీలన, సూచనలు ఇవ్వడం కోసం ఓ సలహా సంఘాన్ని వేయాలని మజ్లిస్‌ సభ్యుడు అక్బరుద్దీన్‌ సూచిం చారు. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని ప్రభుత్వం చెబుతోందని, అదే సమయంలో వేగంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్న తీరును పట్టించుకోవటం లేదని విమర్శించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంఖ్య విషయంలో సంబంధిత వెబ్‌సైట్‌లోనే వేర్వేరు సంఖ్యలను పేర్కొన్న విషయాన్ని ఎత్తిచూపారు. 

Advertisement
Advertisement