కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌!

Published Sat, Oct 28 2017 1:57 AM

harish rao commented over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు కాంగ్రెస్‌ పార్టీ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుందని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ నడిపిస్తామని, ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీఏసీ సమావేశం లో సీఎం ప్రకటించిన తర్వాత కూడా పోడియంలోకి వచ్చి ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.

టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి, విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీలో విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో తొలిరోజు కాంగ్రెస్‌ ఏకాకి అయ్యిందని, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నాయని తెలిపారు.

సభ అంటే ఒక్క కాంగ్రెస్‌ది మాత్రమే కాదని, 120 మంది సభ్యులదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది సరైన పద్ధతి కాదంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కుండబద్దలు కొట్టారన్నారు. కాంగ్రెస్‌ చెప్పిన 19 అంశాలపై మాట్లాడుదామని ముఖ్యమంత్రి బీఏసీలో అంగీకరించినా, కాం గ్రెస్‌ ఎందుకు అసహనంతో వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.


పెట్టుబడి పథకం అక్కడ ఉందా?
‘పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున రైతులకు ఇస్తామంటే కాంగ్రెస్‌కు ఉలుకెందుకు, మీకు ఇష్టం లేదా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం ఉందా, కనీసం ఇలాంటి ఆలోచన వచ్చిందా ఎన్నడైనా’అని ప్రశ్నించారు. ‘ఒకే ఏడాదిలో 16 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్స్‌ కట్టించాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేస్తే మీకు నచ్చడం లేదు. దశాబ్దాల తరబడి ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పెండింగ్‌ పెట్టారు.

మీరు పెండింగులో పెడితే.. వాటి ని మేం రన్నింగ్‌ ప్రాజెక్టులు చేశాం. కాంగ్రెస్‌తో సబ్జెక్టు లేకే ఇలా వ్యవహరిస్తోంది’అని హరీశ్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఇలాంటి వ్యవహార శైలినే ఇకపైనా ప్రదర్శిస్తే, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని, సభా వ్యవహారాల మంత్రిగా మరోమారు అప్పీల్‌ చేస్తున్నానని చెప్పారు.

ఎన్ని రోజులైనా సభను జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సభ్యుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. సభకు అడ్డుతగిలే సంప్రదాయాన్ని కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.  


కాంగ్రెస్‌కు చర్చ కాదు.. రచ్చ కావాలి
కాంగ్రెస్‌ చర్చ కోరుకోవడం లేదని, రచ్చ కోరుకుంటోందని మంత్రి హరీశ్‌ మండిపడ్డారు. సభ నుంచి సస్పెండై బయటకు వెళ్లాలనుకున్నట్లుగా వారి వ్యవహార శైలి కనిపించిందని ఆయన విమర్శించారు.

ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని, పోడియం వదిలి సీట్లలోకి వెళ్లాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి పదే పదే చెప్పినా వెనక్కి వెళ్లలేదని, చూడబోతే వారి నేత జానారెడ్డి మాట్లాడటం కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదని దుయ్యబట్టారు. సభా నాయకుడిగా సీఎం కేసీఆర్‌ మాట్లాడేటప్పుడు కూడా వారు నినాదాలు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.
 

ఇదే శ్రద్ధ అప్పుడు ఉంటే..
‘రైతులపై కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇదే శ్రద్ధ పెట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. నీలం తుఫాను సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని సాయం కోరితే తమ సభ్యులను కాళ్లతో తొక్కుకుంటూ వెళ్లారే కానీ సాయం చేయలేదు.

ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేతలంతా నాడు అధికారంలో ఉన్నవారే’అని హరీశ్‌ గుర్తు చేశారు. రైతులను ఎంతో గోస పెట్టిన కాంగ్రెస్‌కు రైతు సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుతుండటంతో వీరు అసూయ చెందుతున్నారని, 24 గంటల విద్యుత్‌ ఇస్తుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తుంటే కాంగ్రెస్‌ కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. 

Advertisement
Advertisement