కాంగ్రెస్‌లో డబ్బు మూటలే ముఖ్యం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో డబ్బు మూటలే ముఖ్యం

Published Sat, Nov 24 2018 5:27 AM

Harish Rao fires on Congress and Chandrababu - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/నర్సాపూర్‌: ‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, బ్లాక్‌ మనీ ఉన్నోళ్లకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు అమ్ముకుంది. టికెట్ల కేటాయింపులో డబ్బు మూటలే అర్హతగా మారాయి. ఎవరు డబ్బులిస్తే వారికే టికెట్‌. ఉస్మానియా యూనివర్సిటీని అడ్డాగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులను తీసుకెళ్లి రాహుల్‌ గాంధీని కలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్క విద్యార్థి, ఉద్యమకారుడికైనా కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చిందా’అని మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాకూటమిలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంకు కూడా చివరకు టికెట్‌ దక్కలేదని, పొద్దున ఇచ్చిన కుర్చీని సాయంత్రానికి లాక్కున్నారని ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్‌ పార్టీ.. పేదలు, ఉద్యమ నాయకులకు ఎలా న్యాయం చేస్తుందని నిలదీశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, పిడమర్తి రవి వంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు సముచిత స్థానం కల్పించడంతోపాటు ప్రొఫెసర్‌ సీతారాం నాయక్, డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ వంటి జేఏసీ నేతలను పార్లమెంట్‌కు పంపిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. తమ పార్టీ విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను గౌరవిస్తే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వారిని అవమానించి, రాజకీయాలకు వాడుకుని మొండిచేయి చూపిందన్నారు.  

కేసీఆర్‌తోనే ఉజ్వల తెలంగాణ.. 
ఉజ్వల తెలంగాణ కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమవుతుందని హరీశ్‌రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు ముంబై, బెంగళూరు, పుణే వంటి నగరాలవైపు కాకుండా హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు వృద్ధి చెందాయని, తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు మరోమారు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

పని చేసేవారిని కోరుకుంటున్నారు  
రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేసే పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 28న సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రానున్నందున సభ ఏర్పాటుకోసం స్థలాన్ని పరిశీలించేందుకు శుక్రవారం మంత్రి నర్సాపూర్‌ వచ్చారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. దామోదర రాజనర్సింహ, సునీతారెడ్డి తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పలు కేసుల్లో హైకోర్టు కాంగ్రెస్‌ నేతలకు మొట్టికాయలు వేసినా వారికి బుద్ధి రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులు నిండి సాగునీరు కావాలనుకుంటే కారు గుర్తుకు ఓటేయాలని, సాగు నీరు వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని మంత్రి ప్రజలకు సూచించారు.

కూటమి వస్తే అధోగతే..
కాంగ్రెస్‌ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుచే తల్లో ఉందని, అలాంటి పార్టీ చేతిలో తెలంగాణ ఉంటే మళ్లీ ఆగం అవుతుందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి దిక్కు, దిశ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎవరికి వారే లీడర్‌ అని, ఎవరికి ఇష్టం వచ్చింది వారు మాట్లాడతారని అన్నారు. ఆ పార్టీ నేతలకు అధికార యావ, కుర్చీల కొట్లాట తప్ప ప్రజా సేవ పట్టదని విమర్శించారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, స్నేహపూర్వక పోటీ పేరిట బీ ఫారాలు జారీ చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. పరస్పర విశ్వాసం లేని కూటమిని ప్రజలు ఎందుకు విశ్వసించాలని ప్రశ్నించారు. టికెట్లు, డబ్బుల కోసం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబుపై ఆధారపడ్డారని విమర్శించిన హరీశ్‌.. తెలంగాణ తెచ్చుకుంది పరాయి పాలన కోసమా, పక్క రాష్ట్ర సీఎం కనుసన్నల్లో నడవడం కోసమా.. అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలవాలంటే చంద్రబాబునాయుడు చెప్పుచేతల్లో నడుస్తున్న కాంగ్రెస్‌ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement