సిగ్గూ, శరం ఉంటే రాజీనామా చెయ్‌ | Sakshi
Sakshi News home page

సిగ్గూ, శరం ఉంటే రాజీనామా చెయ్‌

Published Sat, Apr 14 2018 11:27 AM

Kadapa Mla Arjun Babu Threw a Challenge To Tdp Minister Adinarayana Reddy - Sakshi

కడప కార్పొరేషన్‌ : మంత్రి ఆదినారాయణరెడ్డికి సిగ్గూ, శరం, చీము, నెత్తురు ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న చిత్రావతి కుడికాల్వకు నీటిని విడుదల చేసిన మంత్రులు వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనన్నారు. ఆనాడు వారి కుటుంబంలో చీలిక తేవడం ఇష్టం లేక.. వైఎస్‌ అందరినీ కూర్చొబెట్టి ఆదిని ఎమ్మెల్యే చేశారని గుర్తు చేశారు. ఈనాడు కూతురు, అల్లుడి కోసం కేశవరెడ్డి ఆస్తులు కాపాడాలని, పేకాట డబ్బుల కోసమే పార్టీ ఫిరాయించాడన్నారు.

ఇప్పుడు కాంట్రాక్టులు, చిన్న చిన్న పనుల కోసం పబ్బం గడుపుకొనే మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. విజయమ్మను, వైఎస్‌ వివేకాను ఓడించాం, వైఎస్‌ జగన్‌ను కూడా ఓడిస్తామని మంత్రి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పులివెందులలో గెలవాలంటే నీ తరం కాదు గదా చంద్రబాబు తరం కూడా కాదని హెచ్చరించారు. మంత్రి ఆది లాగే ఎంతో మంది నాయకులు వైఎస్‌ను, వైఎస్‌ జగన్‌ను విమర్శించారని, వారందరి గతి ఏమైందో ప్రజలకు తెలుసన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఆదికి కూడా అదే గతి పడుతుందని, ఆయనకు డిపాజిట్లు కూడా రావన్నారు. మంత్రి అయినప్పటి నుంచి జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
ఓడిపోయిన చరిత్ర వారిది
మంత్రి సోమిరెడ్డి ఐదు సార్లు ఓడిపోయారని, సతీష్‌రెడ్డి మూడు సార్లు ఓడిపోయారని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి వైఎస్‌ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని సూటిగా ప్రశ్నించారు. సర్పంచ్‌గా కూడా గెలవని సీఎం రమేష్‌ ముఖ్యమంత్రికి బినామీగా మారి వేలకోట్లు వెదజల్లి ఎంపీ పదవి కొనుక్కున్నాడని ఎద్దేవా చేశారు. 2004కు ముందు రాయలసీమకు చుక్క నీరు వచ్చేవి కావని, ఇప్పుడు నీళ్లు ఎలా వచ్చాయో మంత్రులు చెప్పాలన్నారు.

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడం వల్లే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు వస్తున్నాయన్నారు. గండికోట, అవుకు, చిత్రావతి ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తి చేసిన ఘనత కూడా వైఎస్‌ఆర్‌దేనని తెలిపారు. ఆయనకు పేరు వస్తుందనే గత ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పులివెందులకు నీళ్లు ఇవ్వకుండా కుప్పంకు నీళ్లు తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో మంత్రులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గేట్లు ఎత్తే లష్కర్‌ పని చేస్తూ వైఎస్‌ కుటుంబాన్ని విమర్శించడం తగదని హితవు పలికారు. కాంగ్రెస్‌నే ఎదిరించిన వైఎస్‌ జగన్‌కు బీజేపీని ఎదిరించడం ఒక లెక్కకాదన్నారు. 

Advertisement
Advertisement