‘వైఎస్‌ జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉంది’

24 May, 2019 20:19 IST|Sakshi

సాక్షి, నల్గొండ : తాను ఎంపీగా గెలవడం, వైఎస్‌ జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల కోసం దివంగత నేత వైఎస్సార్‌ ఒక్కడుగు వేస్తే.. వైఎస్‌ జగన్‌ రెండడుగులు వేస్తారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎంతో శ్రమించి ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. తన విజయం గురించి మాట్లాడుతూ.. నీతిగా పని చేశాను కాబట్టే ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. ఒక ఎంపీగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం సభలో కొట్లాడతానని పేర్కొన్నారు. పరిపాలనను గాలికొదిలేసి దోపిడీ చేస్తున్న టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఘాటుగా విమర్శించారు.

కాగా గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు నాడే ఆయన ఎంపీగా గెలుపు అందుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు