మోదీ హత్యకుట్ర.. ఆ వార్తల్లో నిజం లేదు | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 12:50 PM

Letter targetting PM is fake, Says Varavara Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారని, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారని పుణె పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరవరరావు, ప్రొఫెసర్‌ హరగోపాల్, చీకుడి ప్రభాకర్, తదితర హక్కుల సంఘాల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మావోయిస్టులను హతమార్చిన గడ్చిరోలీ ఘటనపై గళం ఎత్తుతున్న వారిపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా వరవరరావుపై కుట్ర నమోదుచేశారని, భీమా కోరేగావ్‌ ఆందోళనలకు సంబంధించి ఢిల్లీ, మహారాష్ట్రలో హక్కుల సంఘాల నేతలు ఐదుగురిని ఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని వారు అన్నారు.

ఆ వార్తల్లో నిజం లేదు : వరవరరావు

ప్రధాని మోదీ హత్యమార్చడానికి మావోయిస్టులు రాసిన లేఖలో తన పేరు ఉందన్న కథనాలు అవాస్తమవని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌ట్యాప్‌లో దొరికిందని పేర్కొంటున్న కుట్ర లేఖ అబద్ధమని, ఆ లేఖలో తన పేరు ప్రస్తావించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని విమర్శించారు. మోదీ హత్యకు కుట్ర అంటూ పూణే పోలీసులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘ ఈ కేసులో మీడియా వ్యవహరించిన తీరు దురదృష్టకరం. ఓ చానల్‌ ఇంటర్వ్యూ నుంచి నేను వాకౌట్‌ చేశాను. చర్చలో పాల్గొనేవారు కాదు యాంకరే స్వయంగా నాపై దాడి చేశారు. మావోయిస్టుల శైలి ఏంటో మీడియాకు తెలుసు. మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఆ లేఖలు ఎలా ఉన్నాయో అలానే మీడియా ప్రచురించాలి. ఎవరైనా అవి పార్టీ రాసిన లేఖలు అంటే నమ్ముతారా?’ అని వరవరరావు అన్నారు. రోనాల్డ్ విల్సన్ తనకు తెలుసునని, రాజకీయ ఖైదీల విడుదల కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. హక్కుల సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేసి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని బీజేపీ భావిస్తోందని వరవరరావు మండిపడ్డారు. వరంగల్‌లో అరెస్ట్ చేసిన డీఎస్‌యూ యూనియన్ నాయకులు భద్రి, రంజిత్ సూరి, సుధీర్‌లను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement