Sakshi News home page

ఆంధ్రుల ఆత్మ గౌరవానికి.. ఢిల్లీ అహంకారానికి పోరాటం

Published Thu, Feb 15 2018 4:09 PM

MP Mithun Reddy clarifies on ysrcp mps resignations - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధన కోసం మా పార్టీ ఎంపీలం రాజీనామాలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ రాద్ధాంతం చేయడం మంచిది కాదని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గతంలో మమ్మల్ని రాజీనామాలు చేయలేదని అడిగారు.. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజీనామాలతో వచ్చే ఉప ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య పోరాటంగా అభివర్ణించారు. ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది ప్రజల్లోనే తేల్చుకుందాం రమ్మన్నారు. వివక్షతో కళ్లు మూసుకుపోతే వారికి ఏం ప్రయోజనాలు కనిపించవు. మమ్మల్ని విమర్శించే వాళ్లు జూన్ 4, 2019 వరకూ 15 నెలలపాటు ఎంపీలుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న విషయాన్ని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. అన్నీ తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు మాకు మాత్రం ఓ సాయం చేయాలి. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు చేయబోయే రాజీనామాలు అమలయ్యేలా చేయడంతో పాటు మా పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వచ్చేలా చూడాలన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ, బీజేపీ-టీడీపీలు కలిసి ఆడుతున్న డ్రామాలవల్లే హోదా సాధ్యం కావడం లేదు. 

చంద్రబాబు తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా!
సీఎం చంద్రబాబు మళ్లీ రెండు నాల్కల సిద్ధాంతంతో తెరపైకి వచ్చారు. తెలంగాణలో నా వల్లే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. ఏపీకి వచ్చి మనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పింది చంద్రబాబే. ఇప్పు మళ్లీ అలాగే చేయాలని యత్నిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది. మనమే ఎక్కువ సాధించాం. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు సాధించామని చంద్రబాబే స్వయంగా ప్రకటనలు చేసిన విషయాన్ని ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. సింగపూర్, జపాన్ లో దిగిన ఫొటోలు తప్ప చంద్రబాబు అమరావతిలో సాధించిందేమీ లేదు. విశాఖలో నిర్వహించిన సదస్సు కారణంగా రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయన్నారు. డీఐపీపీ లెక్కల ప్రకారం కేవలం రూ.4.5 వేల కోట్ల పెట్టుబడులే వచ్చాయన్నది వాస్తవం. ప్రతి సీఎం హయాంలోనూ ఇలాగే పెట్టుబడులు ఏపీకి వచ్చాయి తప్ప. ఇందులో చంద్రబాబు ఘనతేం లేదన్నారు. 

బీజేపీ, టీడీపీ రెండు కారణమే
ప్రభుత్వ భూమిలో నాణ్యత లేని తాత్కాలిక కట్టడాలకు ఇంత డబ్బు అవసరమా. బీజేపీ, టీడీపీ మధ్య పంపకాలు జరిగాయని మా అనుమానం. బడ్జెట్ ప్రవేశపెట్టి 15 రోజులు గడిచినా చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు.. మీడియా ముందుకు రావడం లేదు.. వాళ్ల ఎమ్మెల్యే డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకొని కేసు మాఫీ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు 18 సార్లు వచ్చింది, కానీ స్టేలు తెచ్చుకుని నడుస్తున్న బాబు కేసులే లేవనడం హాస్యాస్పదంగా ఉంది. వందల కోట్ల అవక తవకలు జరిగాయని  కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) నివేదిక ఇచ్చింది. పాదయాత్ర మహా యజ్ఞం. వైఎస్ జగన్ అది వదిలి రారు. పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలో ధర్నాలు చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు. హోదా తాకట్టులో టీడీపీ, బీజేపీ ఇద్దరూ దోషులే అని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

What’s your opinion

Advertisement