బీజేపీ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కేంద్ర సహాయ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Thu, Apr 11 2019 9:39 AM

Muzaffarnagar BJP Candidate Sanjiv Balyan Alleges Fake Voting Being Done - Sakshi

లక్నో : మొన్నటి దాకా ప్రచార పర్వంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ప్రముఖులు పోలింగ్‌ వేళ కూడా తమ నోటికి పని చెబుతున్నారు. ఓడిపోతామేమోనన్న భయమో లేదా అలవాటులో పొరపాటుగానో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అభాసుపాలవుతున్నారు. బుర్ఖాలో ఉన్న మహిళలను పరీక్షించడం కుదరదు గనుక దొంగ ఓట్లు పడే అవకాశం ఉందంటూ కేంద్ర సహాయ మంత్రి, ముజఫర్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సంజీవ్‌ బల్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ బుర్ఖా వేసుకున్న మహిళల ముఖాలను చూసే వీలుండదు. వారిని చెక్‌ చేయడం కుదరదు. కాబట్టి ఆ ముసుగులో కొంతమంది వ్యక్తులు దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. లేదంటే ఫేక్‌ ఓటింగ్‌ జరిగిందని తేలిన నేపథ్యంలో రీపోలింగ్‌కు డిమాండ్‌ చేస్తా’ అని సంబంధిత అధికారులను హెచ్చరించారు.

ఈ క్రమంలో ఓటమి భయం పట్టుకున్నందువల్లే సంజీవ్‌ ఇలా మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ముందుగా ఓటమి అంగీకరించిన వాళ్లే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,  ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌,  జమ్ము కశ్మీర్‌, అసోం,  బిహార్‌,  ఒడిశా, చండీగఢ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ల్లోని పలు నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.

Advertisement
Advertisement