సమాధానం చెప్పలేకపోతున్నా!

12 Oct, 2018 01:51 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ‘యాడికి పోయినా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభి లాషులు, బంధువులు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నరు. నువ్వుండగా ముషీరాబాద్‌ టికెట్‌ పెండింగ్‌ల ఎందుకున్నది? సీఎంకు నువ్వు బాగా దగ్గరటగద అని అడుగుతున్నరు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నా. చాలా బాధ అయితున్నది. అల్లుడు శ్రీనివాస్‌ రెడ్డి కూడా బాగా అప్‌సెట్‌ అయిండు’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి కోసం ముషీరాబాద్‌ టికెట్‌ ఆశించినా.. ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. గురువారం చిక్కడపల్లిలోని ఓ జిమ్‌ ప్రారంభానికి అల్లుడి తో కలిసి వచ్చిన నాయిని.. ముషీరాబాద్‌ టికెట్‌ విషయంలో మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ 105 సీట్లు ప్రకటించి నెల రోజులైంది. అందులో ముషీరాబాద్‌ ఎందుకు ఆపారని చర్చ జరుగుతుంది. అమావాస్య తర్వాత ఆపిన 14 సీట్లు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అమావాస్య కూడా అయిపోయింది. ముషీరాబాద్‌ టికెట్‌ గురించి నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నాను’అని నాయిని పేర్కొన్నారు. 

కేసీఆర్‌ ఎప్పుడో మాటిచ్చారు
‘ముషీరాబాద్‌ గురించి ఆర్గనైజ్‌ చేసుకోమని సీఎం చాలా రోజుల క్రితమే నాకు చెప్పాడు. ఆయన మాట మీద విశ్వాసంతో.. అల్లుడు ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తిరుగుతూ కార్యకర్తలను సమీకరించాడు. ఇప్పటికిప్పుడు శ్రీనివాస్‌ రెడ్డి పిలిస్తే 1000 మంది వచ్చే నెట్‌వర్క్‌ తయారైంది. అందుకే సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నాను’అని నాయిని తెలిపారు. కేసీఆర్‌ కూడా ‘నర్సన్నకు చెప్పు.. ఆయనతో మాట్లాడాకే ముషీరాబాద్‌ టికెట్‌ డిక్లేర్‌ చేస్తా. తొందరపడొద్దు’అని కేటీఆర్‌ ద్వారా చెప్పించారన్నారు. ఆ తర్వాత రెండుసార్లు కలిసినా.. కేటీఆర్‌ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. ఈమధ్య పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ తమ పేర్లు కనిపించడం లేదని వాపోయారు. ‘ఈరోజే కాదు.. నాలుగైదురోజుల తర్వాత పేర్లు ప్రకటించినా ఇబ్బందిలేదు. శ్రీనివాస్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే సంతోషమే. లేకుంటే నేనే పోటీ చేస్తానని చెప్పాను. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978 నుంచి ఆర్గనైజ్‌ చేసుకుంటూ వస్తున్నా. నా కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు రండి గెలిపిస్తామంటూ అహ్వానిస్తున్నారు’అని నాయిని పేర్కొన్నారు.

అప్పుడు ఎల్‌బీ నగర్‌ నుంచి..
2014లో నేను ముషీరాబాద్‌ నుంచి పోటీ చేస్తానంటే ‘వద్దు నర్సన్నా నిను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్‌బీ నగర్‌ నుంచి పోటీచెయ్‌. సర్వేలో స్థానిక నాయకులకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి’అని కేసీఆర్‌ అన్నారని నాయిని గుర్తుచేశారు. దానికి సమయం 15 రోజులే ఉంది బాగా డబ్బున్న సుధీర్‌ రెడ్డి మీద కోట్లాడేంత డబ్బు నా దగ్గర లేదంటే ‘నీ తమ్ముడిని నేనున్నా రూ.10 కోట్లు ఇస్తా పోటీచెయ్‌’అన్నాడన్నారు. ఎల్‌బీ నగర్‌లో పోటీకి విముఖత చూపడంతో.. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లో చోటిచ్చాడని నాయిని చెప్పారు. ‘ఇప్పటికైనా కేసీఆర్‌ నాకు అనుకూ లంగానే నిర్ణయం తీసుకుంటారనే నమ్మక ముంది. మా ఇద్దరిలో (మామా అల్లుళ్లలో) ఎవరికి అవకాశం ఇచ్చినా.. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మంగళవారం కేటీఆర్‌ను కలిసి కూడా ఇదే విషయం చెప్పాను. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను. మరో రెండేళ్లపాటు నా ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. దీన్ని ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న వ్యక్తికి ఇచ్చి.. నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే బాగుంటుంది’అని ఆయన అన్నారు. అయితే, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. మామా అల్లుళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
సమావేశంలో  మాట్లాడుతున్న మంత్రి నాయిని 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు