పేద గుండెకు అండాదండ | Sakshi
Sakshi News home page

పేద గుండెకు అండాదండ

Published Fri, Apr 27 2018 7:20 AM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

పల్లె గుండె మండుతోంది..పాలకుల పక్షపాతానికిపల్లె తల్లి తల్లడిల్లుతోంది..ఏలికల వివక్షకుపల్లె ఎక్కిళ్లు పెడుతోంది..సర్కారు నిర్లక్ష్యానికిపల్లె కాడి కిందేస్తోంది...ప్రభుత్వ అసమర్థతకుపల్లె ఈసురోమంటోంది...
ఆర్థిక పరిపుష్టి దక్కకఇలా ప్రజాసంకల్పయాత్రలోపల్లెలు సాగిలపడుతున్నాయి..పల్లెలకు జీవం పోయాలనిజవసత్వాలు నింపాలనివేడుకుంటున్నాయి..అందరికీ ధైర్యం చెబుతూపల్లెలకు పూర్వవైభవం        
కల్పిస్తామని భరోసానిస్తూవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిముందుకు సాగుతున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో : నిలువ నీడ లేదని కంటనీరు పెట్టుకున్న పేద మహిళ...తాగునీరు కోసం నానాయాతన పడుతున్నామన్న పల్లె ప్రజలు..సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్న రైతన్న.. చిన్న గూడు... తాగేందుకు నీరు... పొలాలకు సాగునీరు లేక దైన్యస్థితిలో ఉన్న పల్లెలను చూసి జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు.  రాష్ట్రానికి అన్నపూర్ణ వంటి కృష్ణా జిల్లాలో ఇంతటి విపత్కర పరిస్థితులు ఉన్నాయా అని ఆవేదన చెందారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన గన్నవరం నియోజకవర్గంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. పల్లెల్లో ప్రతి చోటా దైన్యమే గోచరిస్తుండటంతో ఆయన విస్తుపోయారు. తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీనిచ్చారు.

తాగునీరు లేక నానాయాతన....
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 146వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఉంగుటూరు మండలం వెంకటరామాపురంలో గురువారం ఉదయం 7.40 గంటలకు ఆయన  పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి ఇందుపల్లి మీదుగా నందమూరు క్రాస్‌ వరకు 4.20 కి.మీ. పాదయాత్ర చేశారు. డెల్టా ప్రాంతంలో కూడా  తాగునీరు, సాగునీరు కోసం ఇంకా ప్రజలు అల్లాడుతుండటం ఆయన్ని కలచివేసింది. తాగునీరు లేక నానాయాతన పడుతున్నామని ఇందుపల్లికి చెందిన కోటేశ్వరమ్మ, శివ పార్వతి అనే మహిళలు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఎన్నిసార్లు అధికారులు, ఎమ్మెల్యేను అడిగినప్పటికీ ఫలితం లేనే లేదని వాపోయారు. తాము అధికారంలోకి వస్తే తాగునీటి పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తామని హామీనిచ్చారు.

నీరు లేక పంటలు పోతున్నాయి...
 ఇందుపల్లికి చెందిన రైతులు జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలసి సాగునీరు లేక పంటలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొనవద్దని టీడీపీ నేతలు బెదిరించినప్పటికీ తాము వచ్చామన్నారు. పట్టిసీమ అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది తప్పా తమ పొలాలకు మాత్రం నీరు అందించలేదని చెప్పుకొచ్చారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రాజ్యాన్ని తీసుకువస్తామని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

తడికెల ఇంట్లో తలదాచుకుంటున్నాం...
ఉండటానికి చిన్న ఇల్లు కూడా లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుపల్లికి చెందిన లక్ష్మీ ఆవేదన చెందారు. తన పిల్లాడితో కలసి తడికెల ఇంటిలో తలదాచుకుంటున్నానని చెబుతూ కంటనీరు పెట్టుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ ఇల్లు కట్టించి ఇస్తామని ధైర్యం చెప్పారు.  ఫిట్స్‌ వచ్చి కిందపడి చెయ్యి విరిగితే ఆరోగ్యశ్రీ రాదని వెనక్కి పంపేశారని దేవరకుంట రమణ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆపరేషన్‌ చేయకుండా కట్టుకట్టి పంపేయడంతో ప్రస్తుతం ఏ పనీ చేయలేకపోతున్నానని వాపోయారు. ఆయన్ని ఆదుకుంటామని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  ధైర్యం చెప్పారు.

రుణం రాకుండా అడ్డుకున్నారు...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానినని తనకు కల్లుగీత ఫెడరేషన్‌ నుంచి రూ.2 లక్షలు రుణం రాకుండా అడ్డుకున్నారని వీరంకి వెంకటేశ్వరరావు వాపోయారు. పేదల సంక్షేమ పథకాలను కూడా రాజకీయ లబ్ధికి వాడుకోవాలన్న టీడీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టే రోజు త్వరలోనే వస్తుందని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలు ఏవీ అందడం లేదని ఇందుపల్లికి చెందిన మహిళలు జననేత దృష్టికి తెచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇలా దారిపొడవునా తమ బాధలు  చెప్పుకుంటున్న పల్లె ప్రజలకు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెబుతూ పాదయాత్ర కొనసాగించారు.

పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు
గన్నవరం: ప్రజాసంకల్పయాత్రలో 146వ రోజు వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు యార్లగడ్డ వెంకట్రావు, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆనందానికి అవధుల్లేవు...
జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రకు తరలివచ్చారు. పాదయాత్రలో ఎవరూ పాల్గొనకూడదని ఇందుపల్లిలో  టీడీపీ నేతలు బుధవారం రాత్రి బెదిరింపులకు దిగారు. టీడీపీ బెదిరింపులు బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు గురువారం పాదయాత్రలో పాల్గొన్నారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు దారిపొడవునా భారీ సంఖ్యలో బారులుదీరారు. మధిరపాడుకు చెందిన హైమావతి, దేవదాసు ఆయన్ని చూస్తే చాలని పాదయాత్రకు వచ్చారు. ఆయన పలకరించి చేతిలో చెయ్యి వేసి మరీ అప్యాయంగా మాట్లాడటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయారు. జననేతను చూడగానే ఆయన్ని కలిసేందుకు ఇందుపల్లికి చెందిన వికలాంగుడు దుర్గా ప్రసాద్‌  పరుగులు పెట్టడం అందర్ని ఆశ్చర్యపరిచింది. జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఉత్సాహంగా 3 కి.మీ. పాదయాత్ర చేశారు. నాగపుష్ప, వెంకటేశ్వరరావు అనే దంపతలు వై.ఎస్‌.జగన్‌ను కలిసి సాయిబాబా ప్రసాదం అందించారు. ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తూ పూజ చేసి ప్రసాదం తెచ్చామని ఆనందంతో చెప్పారు. ఇలా పాదయాత్ర ఆసాంతం భారీ సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
Advertisement