ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో వేడెక్కిన రాజకీయం | Sakshi
Sakshi News home page

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో వేడెక్కిన రాజకీయం

Published Mon, Mar 11 2019 10:09 AM

Politics Warmed Up With The Release Of The Election Schedule - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదివారం విడుదల చేసింది. దీంతో రాజకీయ వర్గాలు తమవ్యూహాలకు మరింత పదునుపెట్టే యోచనలో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల సమరాంగణంలో ముందు వరుసలో ఉండగా.. తెలుగుదేశం పార్టీ ఇంటిపోరుతో తలబొప్పి కట్టించుకుని అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేని స్థితిలో ఉంది. నేటి నుంచి అభ్యర్థుల ప్రచార పర్వం మరింత వేగం పుంజుకోనుంది. 

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎన్నికల రణరంగానికి రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయి. అనేక రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నా జిల్లాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు పోటీలో ఉన్నా, కేవలం ఉనికి చాటుకోవడానికి మాత్రమే పరిమితం కానున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. పోలింగ్‌కు  తక్కువ గడువు విధించడంతో అభ్యర్థులు ఎత్తులు పై ఎత్తుల్లో రాత్రి నుంచే మునిగిపోనున్నారు.

జిల్లాలో10 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎంపిక చేయగా, టీడీపీలో కడప, ప్రొద్దుటూరు, బద్వేల్‌ అసెంబ్లీ స్థానాల ఎంపిక పూర్తి కాలేదు. అలాగే రాజంపేట పార్లమెంటు అభ్యర్థిత్వం సైతం పెండింగ్‌లో ఉండిపోయింది. కాగా జిల్లావాసి, పులివెందుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉండడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. మరోవైపు రాజకీయాలు మినహా నిర్దిష్టమైన అభివృద్ధి సాధించలేకపోవడం, మునుపటి ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం ఈమారు టీడీపీ అభ్యర్థులను వెంటాడనున్నట్లు రాజకీయ పరిశీలకుల భావన.

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేతలు
ఈమారు ఆయా అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు సోమవారం నుంచి వారి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు పులివెందుల నుంచి తలపడనున్నారు. అక్కడి ప్రజానీకం క్రమం తప్పకుండా వైఎస్‌ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మరోమారు బరిలో ఉన్నారు.

ఆయన 1999 నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు.  ఇప్పటికి వరుసగా నాలుగు పర్యాయాలు ఓటమి చవిచూశారు. ఇరువురు మరోమారు ప్రజా తీర్పుకు సంసిద్ధులయ్యారు. రాజంపేటౖ వెఎస్సార్‌సీపీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నిలవనున్నారు.  టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు బరిలో ఉన్నారు. రైల్వేకోడూరుకు చెందిన చెంగల్‌రాయుడును రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేయించనున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంపూర్ణ సహకారం మేడాకు లభిస్తుండగా, మరో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య తనకు టీడీపీ అన్యాయం చేసిందని వాపోతుండడం విశేషం. రైల్వేకోడూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోటీ చేయనున్నారు. అక్కడి నుంచి ఆయన వరుసగా మూడు సార్లు (2009, 2012, 2014) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నరసింహప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. రాజకీయాలకు నూతన పరిచయం.

ఇదివరకూ సుపరిచితుడిగా కొరముట్ల శ్రీనివాసులు ప్రజల మధ్యకు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాయచోటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉండనున్నారు. శ్రీకాంత్‌రెడ్డి సైతం వరుసగా మూడు సార్లు అక్కడి నుంచి (2009, 2012, 2014) విజయం సాధించారు. మరోమారు ప్రజాభీష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌ రఘురామిరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా, టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ పడనున్నారు.

ఇప్పటికే ఇరువురు ప్రచారం కొనసాగిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి పోటీలో ఉండనున్నారు. ఆమేరకు ప్రచారం సైతం కొనసాగిస్తున్నారు. కమలాపురం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మరోమారు బరిలో నిలవనున్నారు. ఆ పార్టీ సమన్వయకర్త అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డితో కలిసి ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని చేస్తున్నారు.

 టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి ఇక్కడ వరుసగా మూడు సార్లు ఓడిపోయారు. మరోమారు ప్రజాభిప్రాయాన్ని కోరనున్నారు. కాగా ప్రొద్దుటూరు, కడప, బద్వేల్‌ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌బి అంజాద్‌బాషా, డాక్టర్‌ వెంకటసుబ్బయ్య బరిలో ఉన్నారు. ఆమేరకు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థుల ఎంపిక ఖరారు లేదు. 

Advertisement
Advertisement