మోదీ ప్రధానిలా ప్రవర్తించడం లేదు | Sakshi
Sakshi News home page

మోదీ ప్రధానిలా ప్రవర్తించడం లేదు

Published Sat, Feb 8 2020 1:14 AM

Rahul Gandhi Comments On Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ట్యూబ్‌లైట్‌గా వర్ణించడంపై రాహుల్‌ స్పందించారు. మోదీ దేశ ప్రధానిలా వ్యవహరించడం లేదని శుక్రవారం వ్యాఖ్యానించారు. పార్లమెంటులో తనను మాట్లాడకుండా చేసేందుకు బీజేపీ కుట్రపన్ని గందరగోళ పరిస్థితులు సృష్టించిందని ఆరోపించారు. ‘‘సాధారణంగా ప్రధానికి నిర్దిష్టమైన స్థాయి ఉంటుంది. ప్రవర్తించే తీరు ఉంటుంది. కానీ మన ప్రధానికి అలాంటివేవీ లేవు’’ అని విమర్శించారు. పార్లమెంటులో తమ గళం వినిపించకుండా చేస్తున్నారని, గొంతులు నొక్కేస్తున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ప్రధానికి పాలుపోవడం లేదు. ఆయన్ను రక్షించేందుకు బీజేపీ పార్లమెంటును పదేపదే అడ్డుకుంటోంది. తద్వారా ఈ అంశాలపై చర్చ జరగకుండా చేస్తోంది’’ అని వివరించారు. కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్‌లో వైద్యకళాశాల లేకపోవడం వల్ల ప్రజలకు వైద్యం దూరమవుతోందన్న విషయాన్ని ప్రస్తావించేందుకు తాను ప్రయత్నించానని కానీ బీజేపీ అడ్డుకుందని వ్యాఖ్యానించారు.

వయనాడ్‌ అంశం లేవనెత్తితే కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తాను పార్లమెంటు బయట చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ అమర్యాదకరంగా ప్రవర్తించారని, ప్రశ్నోత్తరాల సమయంలో వేరే అంశాలను ప్రస్తావించే హక్కు ఆయనకు లేదని రాహుల్‌ స్పష్టం చేశారు. మంత్రి హర్షవర్ధన్‌పై కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం టాగూర్‌ దాడి చేశారన్న బీజేపీ ఆరోపణను రాహుల్‌ గాంధీ ఖండించారు.  

Advertisement
Advertisement