వైఎస్‌ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం

Published Tue, Oct 2 2018 5:10 AM

Ravali Jagan Kavali Jagan across the state - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌:  వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘రావాలి జగన్‌...కావాలి జగన్‌’ కార్యక్రమంలో సోమవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సీఎం అయితే ప్రతి ఇంటికీ కలిగే ప్రయోజనాలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గడప గడపకూ తిరుగుతూ వైఎస్‌ స్వర్ణయుగం రావాలంటే జగన్‌తోనే సాధ్యమంటూ ప్రజలకు తెలియజెప్పారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి నవరత్నాలను ప్రచారం చేశారు. వైఎస్సార్‌ జిల్లాలో రాజంపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి సుండుపల్లి మండలంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గంలోఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో 20 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి.

ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి నవరత్నాలను ప్రజలకు వివరించారు. రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పులివెందుల నియోజకవర్గంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నవరత్నాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అప్పకొండయ్యపల్లెలో 30 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. నెల్లూరురూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి రూరల్‌ మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నవరత్నాల గురించి వివరించారు. ప్రకాశం జిల్లాలో ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రచారం చేశారు. కృష్ణా జిల్లాలో పార్టీ నేతలు  గడపగడపకు పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రతి గడపకు వెళ్లి నవరత్నాలను వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ కార్యక్రమాలు జరిగాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సమన్వయకర్త వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ పాల్గొన్నారు.

ఉనికి కోసమే బీజేపీపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు తన చేతగానితనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని  వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నేడు రాష్ట్రంలో బలహీనంగా ఉన్న ఆ పార్టీతో యుద్ధం చేస్తున్నానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో సోమవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా భారీ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో కలిసి సజ్జల మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకో కొత్త డ్రామాకు తెరతీయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. గతంలో 2014లో మోదీతో పొత్తు పెట్టుకుని, పవన్‌కల్యాణ్‌తో ప్రచారం చేయించి 600కు పైగా చంద్రబాబు హామీలిచ్చారన్నారు. నాలుగేళ్లకు పైగా బీజేపీతో కలిసి ఉండి, నేడు మోదీకి వ్యతిరేకత ఉందని గమనించిన చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటంతో రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలపై ప్రజలు మండిపడుతున్న తరుణంలో చంద్రబాబు తన ఉనికి కోసం కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీతో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు మాట్లాడడం ఆయన అవివేకమన్నారు. వైఎస్సార్‌సీపీ ఏనాడూ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీతో రెండుసార్లు పొత్తుపెట్టుకున్న బాబు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.

యువతకు బాబు దగా: రోజా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘యువనేస్తం’ పేరుతో నిరుద్యోగులను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement