నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటం: రేవంత్‌ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటం: రేవంత్‌

Published Mon, May 28 2018 1:18 AM

Revanth reddy fired on kcr - Sakshi

కొడంగల్‌: సీఎం కేసీఆర్‌ బుద్ధిలేని నిర్ణయాలు తీసుకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల విభజనతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ జోనల్‌ వ్యవస్థను తెరమీదకు తెచ్చి వికారాబాద్‌ జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

ఈ ప్రాంతానికి సంబంధం లేని జోగుళాంబ గద్వాల జోన్‌లో వికారాబాద్‌ను కలిపి మళ్లీ అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్‌ పైరవీ భవన్‌గా మారిందన్నారు. కేసీఆర్‌ వద్ద పనిచేసే కొంతమంది స్వార్థానికి రాష్ట్రాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చి సమాజానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలపాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడంతో నిరుద్యోగులకు, ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement