టీఆర్‌ఎస్‌ పాలనలో సదుపాయాల్లేవు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పాలనలో సదుపాయాల్లేవు

Published Mon, Jun 3 2019 6:28 AM

Shabbir Ali Comments on TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్లలో కనీస సదుపాయాల కల్పనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సఫలం కాలేకపోయిందని, ఈ అసమర్థ ప్రభుత్వానికి అధికారం ఎలా వస్తోందో ఆ దేవుడికే తెలియాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేదని, అక్షరాస్యతలో దేశంలో తెలంగాణ 25వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలసి ఆయన మాట్లాడారు. రూ.3 వేల విలువ చేసే కేసీఆర్‌ కిట్స్‌ ఇస్తున్న ప్రభుత్వం జిల్లా కేంద్ర దవాఖానాల్లో కనీసం వెంటిలేటర్‌ సౌకర్యం కల్పించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కమీషన్ల కక్కుర్తితో మిషన్‌ భగీరథ నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రాణహిత నది నీటి వినియోగంలో రాష్ట్రం మూడేళ్లు వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.2 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని సీఎం హోదాలో తొలి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో మరో లక్ష వరకు ఖాళీలు ఏర్పడ్డాయని, మొత్తం 2.2 లక్షల ఉద్యోగాలకుగాను ఈ ప్రభుత్వం కేవలం 20 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు.  

సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వకపోతే ఉద్యమిస్తాం...
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది కేసీఆర్‌ కిట్స్‌ కోసమో, ఆసరా పింఛన్ల కోసమో అన్నట్టు కేసీఆర్‌ భావిస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయో శ్వేతపత్రం ప్రకటించాలని, వీటిని ఎలా భర్తీ చేస్తారో కేలండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికై నాలుగు నెలలైనా సర్పంచ్‌లకు ఇంతవరకు చెక్‌పవర్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 24 గంటల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం తమను నిరాశకు గురిచేసిందన్నారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీల్లో ఏమేమి నెరవేర్చారో చెబుతారని ఆశించామని, కానీ ఆసరా పింఛన్లు, కరెంటు తప్ప దేని గురించి చెప్పలేదని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం సాధించాల్సిన ప్రగతిలో 10 శాతం కూడా సాధ్యం కాలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఐదేళ్ల పాలన పూర్తిగా వైఫల్యాలమయమని, ఇది కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని షబ్బీర్‌ అలీ విమర్శించారు.  

Advertisement
Advertisement