హోదాపై కేంద్రం అసత్యాలు | Sakshi
Sakshi News home page

హోదాపై కేంద్రం అసత్యాలు

Published Sat, Jul 21 2018 4:17 AM

TDP MP Jayadev Galla quotes Bharath Ane Nenu in Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందంటూ కేంద్రం అసత్యాలు చెబుతోందని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఇచ్చిన హామీని విస్మరించిన వ్యక్తి ఎన్నటికీ మనిషి కాలేడని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అను నేను’ సినిమాను ప్రస్తావించారు. ‘విభజన పాపంలో బీజేపీకి సగం వాటా ఉంది.

నాటి ప్రధాని మన్మోహన్‌ ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా? ప్రత్యేక హోదా ఐదు కాదు..పదేళ్లు ఇస్తామంటూ తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. ఢిల్లీని మించిన రాజధానిని ఆంధ్రప్రదేశ్‌కు నిర్మిస్తామని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని నాడు మోదీ మాటిచ్చారు. చివరికి అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు మాత్రం ఇచ్చారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ ఏర్పాటుకు రూ.3,000 కోట్లు, ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఖర్చు పెడతారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.58 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూ.6 వేల కోట్లే ఇచ్చారు’ అని అన్నారు.

‘మోసగాడు’ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతుండగా.. ప్రధాని మోదీ మోసగాడు అంటూ ఎంపీ శివప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రధానిని మోసగాడు అనడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శివప్రసాద్‌ వ్యాఖ్యలను రక్షణ మంత్రి సీతారామన్‌ ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాంటి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ పేర్కొన్నారు. 

సమీక్షించనేలేదు: రామ్మోహన్‌
విభజన చట్టం అమలుపై కేంద్రం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీలో విలాసవంతమైన కార్యాలయాన్ని కట్టుకున్న బీజేపీ నాలుగేళ్లు అయినా ఏపీలో కేంద్ర సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. చట్టంలో హోదా లేదంటున్న బీజేపీ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో ఎలా కలిపారో అలా ఎందుకు చేయడం లేదని నిలదీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement