ఆపరేషన్‌ కూకట్‌పల్లి | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ కూకట్‌పల్లి

Published Tue, Dec 4 2018 9:06 AM

TDP Operation Kukatpally in Telangana Elections - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి రాజకీయ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చయింది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికతో ప్రచారంలో దూసుకుపోతుండగా, ఆలస్యంగా రంగంలోకి దిగిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచార భారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణపైనే వేశారు. ఇప్పటి దాకా వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్న సుహాసినీ.. కాలనీలు, అపార్ట్‌మెంట్ల వారీగా పూర్తి స్థాయిలో జనాన్ని కలుసుకుపోలేకపోయారు. రెండు రోజుల క్రితమే చంద్రబాబు, బాలకృష్ణలు రోడ్‌షోలు నిర్వహించినా, సోమవారం మరోసారి చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోకలిసి కూకట్‌పల్లిలో మరో సభ నిర్వహించారు.

మరోవైపు ఏపీకి చెందిన ముఖ్య నాయకులందరినీ కూకట్‌పల్లిలో మోహరించి వార్డులు, డివిజన్ల వారిగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యనేతలతో పాటు సుమారు వెయ్యి మంది కార్యకర్తలు సైతం కూకట్‌పల్లి లాడ్జీల్లో దిగారు. గ్రేటర్‌లోని టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ఏపీ నేతలంతా హైదరాబాద్‌ మకాం వేశారు. ఉదయం వేళలల్లో తమకు అప్పగించిన ప్రాంతంలో తమ సామాజికవర్గం ఓటర్లను కలుసుకుంటున్న నాయకులు.. రాత్రివేళల్లో ఎలాగైనా గెలవాలన్న వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఏపీ టీడీపీ నేతలు కళా వెంకట్రారావు, ప్రభాకర్‌ చౌదరి, రామ్మోహన్‌నాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేదవ్యాస్, గొట్టిపాటి రవికుమార్, బీద రవిచంద్రయాదవ్, జూపూడి ప్రభాకరరావు, కనుమూరి బాపిరాజు, రుద్రరాజు తదితరులు వారం రోజులుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ప్రత్యేక మంత్రాంగం
‘దేశం’ అభ్యర్థి తరఫున రంగంలోకి దిగిన వారంతా ఓటర్లకు వివిధ రకాలుగా ప్రలోభ పెడుతున్నట్టు, వారిని తమవైపు తిప్పుకోవాలని క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 380 బూత్‌లకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేసే దిశగా ‘దేశం’ ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీకి ఒక్కకేపీహెచ్‌బీ కాలనీలోనే భారీగా మద్దతుదారులు ఉండగా, మూసాపేట, బాలానగర్‌లో ఓ మోస్తరుగా, కూకట్‌పల్లి, అల్లాపూర్, బోయిన్‌పల్లి, ఫతేనగర్‌లో పూర్తి బలహీనంగా ఉందని గుర్తించిన నాయకులు ప్రత్యేక మంత్రాంగానికి వ్యూహం రచించినట్టు సమాచారం. ఇందుకోసమే ఆయా ప్రాంతాలు, సామాజిక వర్గాల వారిగా నాయకులను ఆయా ప్రాంతాలకు ఇన్‌చార్జులుగా నియమించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సుమారు లక్షా యాభైవేల వరకు స్థానికేతరుల ఓట్లు ఉండగా, అందులో 50 వేల వరకు ఉత్తరాది రాష్ట్రాల వారి ఓట్లు ఉన్నాయి. మిగిలిన ఓట్లలో జిల్లాల వారిగా విభజించి తమ అభ్యర్థి గెలవాలంటే ఎవరికి ఏంకావాలో తెలుసుకుని, వారిని ప్రసన్నం చేసుకునే బాధ్యతలను కళా వెంకట్రావు, ప్రభాకర్‌ చౌదరిలకు అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీ కుయుక్తులను టీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఆధారాలతో సహా ఎన్నికల సంఘం ముందుంచేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
Advertisement