ఇక సమరమే! | Sakshi
Sakshi News home page

ఇక సమరమే!

Published Mon, Mar 25 2019 9:25 AM

Telangana Lok Sabha Election Campaign All Parties - Sakshi

సాక్షి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల పోరు షురూ అయింది. జహీరాబాద్‌ రాజకీయ ముఖచిత్రంపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ తిరిగి పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నుంచి మదన్‌మోహన్‌రావు ఇప్పటికే సంగారెడ్డిలోని రిటర్నింగ్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాటిల్‌ తరపున ఇప్పటికే రెండు సెట్ల నామినేషన్లు ఆపార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఆయన స్వయంగా మరో సెట్టు నామినేషన్‌ను ఈ నెల 25వ తేదీ సోమవారం రోజున దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి సైతం సోమవారం రోజున నామినేషన్‌ వేయనున్నారు.

సిట్టింగ్‌లపైనే టీఆర్‌ఎస్‌ భరోసా 
పలు ఊహాగానాలు, ఉత్కంఠకు గులాబీ దళపతి కేసీఆర్‌ తెరదించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్, మెదక్‌ పార్లమెంటు స్థానాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలకే అవకాశం ఇచ్చారు. జిల్లా పరిధిలోని జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్‌లు జహీరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోకి, మెదక్‌ పార్లమెంటు పరిధిలోకి సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. కాగా జహీరాబాద్‌ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్‌లు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. జహీరాబాద్‌ పార్లమెంటుకు 2014 సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా బీబీ పాటిల్‌కు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ శేట్కార్‌పై సుమారుగా లక్షా 44 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మెదక్‌ స్థానం నుంచి మరోమారు సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డినే ఖరారు చేయడంతో ఇక ప్రచారానికి పదును పెట్టనున్నారు. ఈనెల 25న నామినేషన్ల దాఖలుకు చివరిరోజు ముగియగానే ప్రచారంలో దూసుకుపోవడానికి ప్రధాన పార్టీలు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఏప్రిల్‌ 3వ తేదీన జహీరాబాద్‌ సెగ్మెంట్‌లోని ఆందోల్, మెదక్‌ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్‌ ఎన్నికల బహిరంగసభను నిర్వహించడానికి పార్టీ నిర్ణయించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ లోక్‌సభ పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో శనివారం మాజీ మంత్రి, సిద్ధిపేట్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో నిర్ణయాత్మకశక్తిగా అవతరిస్తామనే సంగతిని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
పార్టీ ప్రముఖులతో కలిసి... 
జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున మొదటి విడతలోనే ఖరారుచేసిన కె.మదన్‌మోహన్‌రావు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు ఇన్‌చార్జి షబ్బీర్‌అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి జే.గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌ శేట్కార్, ఎమ్మెల్యే సురేందర్, తదితరుల సమక్షంలో ఆయన సంగారెడ్డి రిటర్నింగ్‌ కార్యాలయంలో తన నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ప్రచారానికి పదును పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గం తప్ప మిగిలిన ఆరు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయినప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం సడలకుండా... క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో సాధ్యమైనంత ఎక్కువగా తిరగాలని ప్రణాళికలు సిద్ధ చేస్తున్నారు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వయంగా ఆయన నామినేషన్ల చివరి రోజైన సోమవారం నాడు మరో సెట్టు నామినేషన్‌ వేయనున్నారు. ఇక జహీరాబాద్‌ పార్లమెంటు నుంచి పోటీచేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర తర్జనభర్జనల అనంతరం అభ్యర్థిగా బానాల లక్ష్మారెడ్డిని ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో జిల్లా పరిధిలోని జహీరాబాద్, మెదక్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. బిష్కింద పీఠాధిపతి సోమాయప్ప, బానాల లక్ష్మారెడ్డిల మధ్య పోటీ నెలకొనగా...అధిష్టానం చివరకు కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బానాల లక్ష్మారెడ్డికే అవకాశం కల్పించారు. ఈయన కూడా సోమవారం రోజున నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ప్రముఖులతో ప్రచారం... 
పార్లమెంటు గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నందువల్ల ఆయా పార్టీల అధినేతలతో ప్రచారం చేయించడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వాలు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. మెదక్‌ పార్లమెంటు స్థానం పరిధిలోని నర్సాపూర్‌లో, జహీరాబాద్‌ పరిధిలోని ఆందోల్‌లో వచ్చేనెల 3వతేదీన గులాబీ దళపతి కేసీఆర్‌ ఎన్నికల భారీ బహిరంగస¿భ¶ ఖరారు చేశారు. 
అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు తరపున రాహుల్‌గాంధీ, బీజేపీ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి తరపున ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే పక్షం రోజులు ప్రచార సభలతో జహీరాబాద్, మెదక్‌ నియోజకవర్గాలు  హోరెత్తనున్నాయి.

Advertisement
Advertisement