మొక్కవోని ‘దీక్ష’ | Sakshi
Sakshi News home page

మొక్కవోని ‘దీక్ష’

Published Mon, Apr 9 2018 1:17 AM

Third day to the YSRCP MPs hunger strike  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఉక్కు సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించినా, అస్వస్థతకు గురైనా తమ ఆశయాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ఢిల్లీ ఎపీ భవన్‌లోని దీక్షా ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎంపీ, మాజీ ఐఏఎస్‌ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు బ్లడ్‌ షుగర్‌ స్థాయి తగ్గి, ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. 65 ఏళ్ల వయసున్న వరప్రసాదరావు మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరో గ్యం క్షీణించడం, అయినా తాను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేయడంతో వేదిక ప్రాంగణంలో ఉన్న పార్టీ నేతలు, శ్రేణుల కళ్లు చెమ్మగిల్లాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు రామ్‌మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రికి తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలని, పోలీసుల జులుం నశించాలని, ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. 

వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిపి ప్రసంగిస్తున్న సీపీఐ నేత డి.రాజా 

ఎంపీలకు విజయమ్మ పరామర్శ  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆదివారం ఉదయం ఢిల్లీ వచ్చారు. ఆమె రాక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు పార్టీ నేతలు సైతం ఇక్కడికి తరలివచ్చారు. విజయమ్మ ఉదయం 11.15 గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న ఎంపీలను పరామర్శించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆమె ఆసుపత్రికెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పరామర్శించారు. 

సీపీఐ సంఘీభావం  
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సంఘీభావం తెలిపింది. ఆ పార్టీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఆదివారం సాయంత్రం 4 గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులను త్యా గం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని, హోదాపై ప్రధానమంత్రి తక్షణమే స్పందించాలని డి.రాజా డిమాండ్‌ చేశారు.  

భారీగా వచ్చిన ఢిల్లీ తెలుగు ప్రజలు 
వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. వివిధ తెలుగు సంఘాల నేతలు తరలివచ్చి ఎంపీల కు మద్దతుగా నిలిచారు. హోదా ఉద్యమాన్ని చిత్తశుద్ధితో ముందుకు నడిపిస్తోంది వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్నారు. పలువురు విద్యార్థులు, ఢిల్లీలో పనిచేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగులు దీక్షా ప్రాంగణానికి చేరుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు.  

క్షీణించిన వరప్రసాదరావు ఆరోగ్యం  
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాదరావు ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం ఆయన విపరీతమైన తలనొప్పి, బీపీ హెచ్చుతగ్గులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు రామ్‌మనోహర్‌లోహియా ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. షుగర్‌ లెవల్స్‌ 60కు, బీపీ 110/70కు, పల్స్‌ రేటు 60కి, కీటోన్‌ లెవల్స్‌ ప్లస్‌ టూకు చేరుకోవడంతో దీక్షను విరమించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే తనకేం ఫర్వాలేదని వరప్రసాదరావు నిరాకరించారు. వైద్యుల సూచన మేరకు పోలీసులు ఆయనను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి రామ్‌మనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీక్ష సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఇంకా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. బీపీ లెవెల్స్‌లో తరచు హెచ్చుతగ్గులు ఉండడంతో ఆయన్ను ఇంకా ఐసీయూలోనే ఉంచినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి రాత్రి 8.20 గంటలకు వైద్య పరీక్షలు చేశారు. బీపీ 104/74, పల్స్‌రేటు 82, షుగర్స్‌ లెవెల్స్‌ 77గా ఉన్నాయి. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. 
దీక్షా శిబిరం నుంచి ఎంపీ వరప్రసాదరావును బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు 

పోరాటం ఫలించాలి
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సంఘీభావంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఢిల్లీ తెలుగు ప్రజలు రాత్రి ఏడు గంటలకు ఏపీ భవన్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బయట ప్రధాన రహదారి వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎంపీల పోరాటం ఫలించాలని ఆకాంక్షించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వారు విమర్శించారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అంగీకరించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు.   

ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ భవన్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు 


Advertisement
Advertisement