25వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

25వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Dec 4 2017 3:23 AM

YS Jagan 25 day Padayatra diary - Sakshi

03–12–2017, ఆదివారం,
బసినేపల్లి, అనంతపురం జిల్లా.

నేను రైతునని అన్నదాత గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి
ఈ రోజు పత్తికొండ నియోజకవర్గం ఎర్రగుడిలో రైతు సదస్సు జరిగింది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆలోచనలను మరింత విస్తృతం చేసుకోవడానికి రైతులు ఈ సదస్సు నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా రైతు సమస్యలపై పనిచేస్తూ, వివిధ రైతు సంఘాల నాయకులుగా ఉన్న ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విత్తనం నాటే దగ్గర్నుంచి, తన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మే వరకూ.. వివిధ దశల్లో రైతు ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వ్యవసాయ రంగంపై ఆలోచనలను సుసంపన్నం చేసే అనేక సలహాలు, సూచనలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయి. అందుకుగాను వారికి ధన్యవాదాలు.

ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం వల్ల రైతులు విపరీతమైన ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నా దగ్గర స్పష్టమైన ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికా ఉన్నాయి.. రైతుల సమస్యలు భూమి టైటిల్‌ నుంచే మొదలవుతాయి. అందువల్ల మన వ్యవసాయ భూములకు టైటిల్‌ సమస్యలు రాకుండా చేసేందుకు, రైతుల భూములన్నిటికీ స్పష్టమైన టైటిల్స్‌ ఇస్తాము. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తు, సాగునీరు, సకాలంలో వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయానికి అయ్యే ఖర్చు తగ్గించడం కోసం రైతు భరోసా పథకం, వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సకాలంలో తగు సూచనలు, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు, పంటను నిల్వ చేయడానికి గిడ్డంగి సౌకర్యాలు, దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, చివరిగా పండిన పంటకూ గిట్టుబాటు ధర, అనువైన చోట వ్యవసాయానుబంధ పరిశ్రమలు స్థాపించి రైతుకు మరింత లబ్ధి చేకూర్చడం. మన ప్రభుత్వం తీసుకునే ఈ చర్యల వల్ల రైతుల జీవితాలు బాగుపడతాయి. పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. రాష్ట్రానికి ఆహార భద్రత లభిస్తుంది.

ఈ రోజు రైతు గర్వంగా నేను రైతునని చెప్పుకునే పరిస్థితి లేదు. రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఒక వేళ ఉద్యోగం రాకపోయినా, అదొక ఉపద్రవంలా భావించకుండా నేను వ్యవసాయం చేయగలను.. పది మందికి ఉపాధి కల్పించగలనని ఆలోచించే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకురావాలి. ఇంకా చెప్పాలంటే ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, బ్యాంకర్, డాక్టర్‌లు తమ వృత్తుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. రైతు కూడా తన వృత్తి గురించి అంతే గొప్పగా చెప్పుకునే రోజులు రావాలి. ఉన్నత విద్యావంతులు వ్యవసాయాన్ని ఒక పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టే స్థాయికి వ్యవసాయాభివృద్ధి జరగాలి.

ఈ రోజుతో కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. మొత్తం 18 రోజులు, ఏడు నియోజకవర్గాల్లోని 14 మండలాలు తిరిగాము. ఈ జిల్లా ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు నేను మరిచిపోలేను. వారి ప్రేమకు నేను సర్వదా రుణపడి ఉంటాను. అందుకే.. ఈ పాదయాత్ర సమయంలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సిన ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను.
- వైఎస్‌ జగన్‌

తుగ్గలి మండలం చెరువు తండా వద్ద లంబాడీ మహిళతో కలసి నృత్యం చేస్తున్న జగన్‌

Advertisement
Advertisement