55వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

బాబు ఇలాఖాలోనే ఇన్ని సమస్యలా?

Published Mon, Jan 8 2018 1:17 AM

YS Jagan PrajaSankalpaYatra Dairy 55th Day - Sakshi

55వ రోజు
07–01–2018, ఆదివారం
చౌడేపల్లి క్రాస్,
చిత్తూరు జిల్లా.

తప్పెట్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితులు, హారతులతో బారులు తీరిన అక్కాచెల్లెమ్మలు, నాన్నగారి ప్రతిమలను తలపై ఉంచుకుని నడుస్తున్న అభిమానులు, పార్టీ పతాకాలను చేతబట్టిన కార్యకర్తలు, పలు రకాల వేషధారులు, పౌరాణిక పాత్రధారులతో ఉత్సాహభరితంగా చంద్రగిరి నియోజకవర్గంలో యాత్ర సాగింది. పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఇక్కడి ప్రజల ఇబ్బందులు, ఈ ప్రాంతంలో నెలకొన్న అనేకానేక సమస్యలు వింటుంటే ముఖ్యమంత్రి సొంత ప్రాంతంలోనే ఇన్ని సమస్యలా.. అని విస్మయం కలిగింది. ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసి’ అన్నారు. అంతేకాదు, పుట్టిన ప్రాంతం కన్నతల్లితో సమానం అంటారు. ఎక్కడెక్కడో ఉన్న ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. సొంత ప్రాంతానికి మంచి చేసే అవకాశం రావడమే అదృష్టం.

అటువంటి అవకాశం ఉండి కూడా ఏమీ చేయకపోవడాన్ని ఏమనుకోవాలి? ఈ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, హాస్పిటల్, చంద్రబాబు చదువుకున్న స్కూలు, మామిడి మార్కెట్టు.. ఇలా చెప్పుకుంటూపోతే అన్నింట్లోనూ సమస్యలే. ముఖ్యమంత్రిగా ఉండి సొంత ప్రాంతానికి ఏమీ చేయని వ్యక్తి రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానంటాడు. ఏ దేశానికి పోతే ఆదేశంలాగా చేస్తానంటాడు. దీన్ని చూస్తుంటే చంద్రబాబుగారి గురించి నాన్నగారు తరచూ చెప్పే సామెత.. ‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ గుర్తొచ్చింది.

దామలచెరువులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చొక్కా లేకుండా వచ్చిన తాత మాట్లాడాడు. ఆయన పేరు వెంకటాచలంనాయుడు. వేలాది మంది రైతులకు, ఎంతో మంది కార్మికులకు జీవనాధారమైన చిత్తూరులోని విజయా డెయిరీ ఒకప్పటి ప్రాభవాన్ని, సొంత కంపెనీ హెరిటేజ్‌ ఎదుగుదల కోసం దాన్ని మూత వేయించడానికి చంద్రబాబు పన్నిన కుట్రలను, అది మూతపడటంతో నష్టపోయిన రైతాంగం గురించి, రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాల గురించి కళ్లకు కట్టినట్టు వివరించాడు.

అంతేకాదు, చంద్రబాబు నిర్వాకంతో రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, అదే సమయంలో ప్రయివేటు చక్కెర ఫ్యాక్టరీలు మాత్రం లాభాలతో విలసిల్లాయని తెలిపాడు. చంద్రబాబుగారి మోసాన్ని, చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ.. విజయా డెయిరీ తిరిగి ప్రారంభమయ్యే దాకా చొక్కా, చెప్పులు ధరించనని శపథం చేశాడట. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తే గాంధేయ మార్గంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నాడంటేనే అది చంద్రబాబుకు సిగ్గుచేటయిన విషయం. దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం మరింత దారుణం.

మధ్యాహ్నం గుండ్లపల్లి దగ్గర కూడా విజయా డెయిరీ కార్మికులు కలిసి ‘అన్నా.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డెయిరీని తెరిపించండి.. మమ్మల్ని, రైతుల్ని ఆదుకోండి’ అని విన్నవించారు. మనసుకు చాలా బాధేసింది. కేవలం తన ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది రైతుల, కార్మికుల జీవితాలను బలిచేయడం ఎంత దారుణం. వారందరి ఉసురు పోసుకుని ఏం సాధించాలని! ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంతమంది గుండెల్లో బతికామన్నది ముఖ్యం.

చివరిగా, ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు బాగోగులు పట్టించుకోని మీరు.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేస్తాననడం హాస్యాస్పదం కాదా?

పుదిపట్లబైలు వద్ద వేదవిద్యార్థితో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement