71వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

అభాగ్యుల గోడు ఈ సర్కారుకు పట్టనట్టుంది

Published Fri, Jan 26 2018 3:10 AM

ys jagan prajasankalpa yatra dairy 71st day - Sakshi

71వ రోజు

25–01–2018, గురువారం
సగటూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా


ఈ రోజు ఉదయం పత్రికలు చూడగానే నవ్వొచ్చింది. ముఖ్యమంత్రిగారు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను అధికారులు పరిశీలించారట. శిథిలావస్థలో ఉన్న ఆ స్కూలును పునర్నిర్మించాలని నిర్ణయించారట. ఒక ముఖ్యమంత్రిగారి సొంత ప్రాంతంలో, స్వయానా ఆయన చదువుకున్న పాఠశాల దుస్థితిని కూడా.. ప్రతిపక్ష నేత చెబితేగాని పట్టించుకోని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే.. ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా?

ఒక ఊరు మొత్తం ఏకస్వరంతో నినదించిన మాట నన్ను ఆలోచనల్లో పడేసింది. ‘మా ఊరు గవర్నమెంట్‌ లిస్టులో లేదా అన్నా..’ అన్న ఆ మాట కొంత విస్మయాన్ని కలిగించింది. వరదారెడ్డి కండ్రిగ గ్రామం నుంచి పాదయాత్ర  సాగుతున్నప్పుడు నాకు ఆ అనుభవం ఎదురైంది. ఆ గ్రామానికి చెందిన మహిళలంతా వచ్చి ‘అన్నా.. మా ఊరు ప్రభుత్వ లెక్కల్లో ఉందా, లేదా? నిజంగా మాకు అలానే అనిపిస్తోంది. మా ఊరికి రోడ్లు లేవు, తాగు నీరు అందడం లేదు. వీధి లైట్లు లేవు. బస్సులు రావు. అసలు అధికారులకుగానీ, ప్రభుత్వానికిగానీ మా ఊరు ఒకటుందనేది కూడా తెలుసో లేదో..’ అన్నారు.

‘పిల్లలను బడికి పంపాలన్నా ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ వారు వాపోతుంటే.. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. మీ పెద్ద కొడుకుగా చెబుతున్నా.. మీ సమస్యలు తీరే రోజు ఎంతో దూరంలో లేదని భరోసా ఇచ్చి ముందుకు సాగాను. ఇలాంటి గ్రామాలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఓ వైపు అన్ని రకాల చార్జీలు పెంచుతూ, ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూ, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న ఈ ప్రభుత్వానికి.. కనీస సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యత కూడా లేదా?

దారిలో ఓ 32 ఏళ్ల చెల్లెమ్మ కన్నీటి కథ నన్ను కదిలించింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండే ఆమె భర్త ఎనిమిదేళ్ల కిందట ఎయిడ్స్‌తో చనిపోయాడట. వైద్య పరీక్షలో ఆమెకు కూడా హెచ్‌ఐవీ సోకిందని తెలిసిందట. అప్పటి నుంచి ఆమెకు అన్నీ కష్టాలే. ‘నేనేం పాపం చేశాను సార్‌.. ఏ తప్పూ చేయకపోయినా ఇలా కష్టాలు అనుభవిస్తున్నాను. అత్తింటి వారు నా భర్త ఆస్తిలో వాటా ఇచ్చేదిలేదంటున్నారు. బంధువులెవ్వరూ పలకరించడంలేదు. ఉన్న ఒక్కగానొక్క కూతురూ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఉన్న ఊరూ ఈసడించుకుంటోంది’ అంటూ గుండెల్ని కదిలించే తన కష్టాల కథ చెప్పిందా తల్లి.

మందులు వాడుతోందట. మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. అసలు తినడానికే లేనప్పుడు, మంచి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందనేది ఆమె బాధ. ‘ఎంత నీరసంగా ఉన్నా.. కూలో నాలో చేసుకుని పొట్ట పోసుకుందామంటే ఎవరూ పని ఇవ్వడంలేదట. ‘ప్రభుత్వం వారు మా లాంటి వారికి ఇస్తామన్న రూ.1000 పింఛన్‌ ఇవ్వడంలేదు. కడుపు కాలినా నిరసన తెలియజేయలేని పరిస్థితి నాది. చావడానికి ధైర్యం చాలడంలేదయ్యా’ అన్న ఆమె మాటలు గుండెను పిండేశాయి.

ఇలాంటి చెల్లెమ్మలకు ఏదైనా దారి చూపితే బావుంటుంది. ఈ సామాజిక సమస్యకు సరైన పరిష్కారం చూపాలి. వారికి ఏదో ఒక జీవనోపాధి కల్పించాలి. ఈ సర్కారుకు ఇలాంటి అభాగ్యుల గోడు ఏమాత్రం పట్టనట్టుంది. వారి పట్ల ఈ ముఖ్యమంత్రి ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని హెచ్‌ఐవీ బాధితులం దరికీ నెలకు రూ.1000 ఇస్తానని చెప్పిన మీరు.. ఆ అభాగ్యులను కూడా వంచించడం న్యాయమేనా? వారికి ఇవ్వాల్సిన పింఛన్లు దాదాపు 80 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయంటే.. అంతకన్నా అమానుషం ఏమైనా ఉంటుందా?

Advertisement
Advertisement