పాలకపక్షమా..ప్రతిపక్షమా..? | Sakshi
Sakshi News home page

పాలకపక్షమా..ప్రతిపక్షమా..?

Published Sat, Feb 10 2018 6:35 AM

ys jaganmohan reddy fight for special status : kakani - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌):   సీఎం చంద్రబాబు తీరు చూస్తుంటే పాలకపక్షంలో ఉన్నారా.. ప్రతిపక్షంలో ఉన్నారాననే అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. హోదా అనే అంశాన్ని నీరు గార్చేందుకే డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మద్దతు తెలుపుతూ, మరో పక్క ప్లకార్డులను ప్రదర్శించడం చూస్తుంటే చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.

నాలుగేళ్లుగా హోదాపై నోరు మెదపని టీడీపీ నాయకులు గురువారం వామపక్షాలతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో చేస్తున్న బంద్‌ సందర్భంగా బంద్‌ చేస్తామంటూ రోడ్డుపైకి రావడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయమని నిర్ణయించుకున్న ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే బంద్‌లలో పాల్గొంటా రిహార్సల్స్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

దోచుకుంది దాచుకునేందుకే విదేశాలకు
ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును దాచుకునేందుకే విదేశాలకు వెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అజెండా మొత్తం అవినీతే అని విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ నెరవేర్చకుండా ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రం నాలుగుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగినా పట్టించుకోని చంద్రబాబు, ఇటీవల ప్రవేశపెట్టిన ఐదో బడ్జెటో మొసలికన్నీరు కార్చడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు విదేశాలకు తిరుగుతున్నారని, ఇంత వరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ నేతల ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో టీడీపీ
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులను కేటాయించకపోవడానికి చంద్రబాబే కారణమని.. గతంలో రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని, ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని బీజేపీ నేతలు చంద్రబాబును ప్రశ్నిస్తే, వాటికి టీడీపీ నేతల వద్ద సమాధానం లేకపోవడం సిగ్గుచేటన్నారు. దీని బట్టి చంద్రబాబు ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని చెప్పారు.

ప్రత్యేక హోదాపైజగన్‌ అలుపెరగని పోరాటం
రాష్ట్ర ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. వామపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌కు కూడా జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలిపి ప్రజాసంకల్ప యాత్రకు గురువారం విరామమిచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని వెళ్తానని గతంలో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు.   వెంకటాచలం, ముత్తుకూరు జెడ్పీటీసీలు వెంకటశేషయ్య, శివప్రసాద్, నాయకులు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement