2 రోజుల్లో 24 వికెట్లు.. ఇదేం పిచ్ బాబోయ్! | Sakshi
Sakshi News home page

2 రోజుల్లో 24 వికెట్లు.. ఇదేం పిచ్ బాబోయ్!

Published Sat, Feb 25 2017 4:29 PM

2 రోజుల్లో 24 వికెట్లు.. ఇదేం పిచ్ బాబోయ్!

పుణె: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయానికి కారణం ఏంటి? బ్యాటింగ్ వైఫల్యమా? నాణ్యత లేని పిచ్ తయారు చేయడమా? ఇవి రెండూ కారణమా? ఏమైనా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. రెండు రోజుల్లో 24 వికెట్లు పడ్డాయి. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ కలసి మొత్తం 12 వికెట్లు తీయగా, ఆసీస్ స్పిన్నర్ ఓకెఫీ ఒక్కడే 12 వికెట్లు తీశాడు. తొలిరోజు నుంచే పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించగా, మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. దీంతో ఆతిథ్య వేదిక పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. వికెట్‌ను రూపొందించిన క్యూరేటర్లపై ఎన్నో ప్రశ్నలు, విమర్శలు వస్తున్నాయి.

పుణె స్టేడియం పిచ్‌ను లోకల్ క్యూరేటర్ పాండురంగ సల్గాన్కర్, బీసీసీఐ చీఫ్‌ క్యూరేటర్ దల్జీత్ సింగ్, వెస్ట్ జోన్ క్యూరేటర్ ధీరజ్ ప్రసన్న పర్యవేక్షించారు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సల్గాన్కర్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని, బంతి బ్యాట్‌పైకి వస్తుందని చెప్పాడు. కాగా ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. తొలిరోజు నుంచే బంతి టర్న్ అవుతుందన్నాడు. స్మిత్ చెప్పినట్టుగా ఇక్కడ బౌలర్ల ఆధిపత్యం నడిచింది. పిచ్ తయారీలో టీమిండియా మేనేజ్‌మెంట్ జోక్యం చేసుకుందా? సల్గాన్కర్‌కు ఏవైనా సూచనలు వచ్చాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే వేదికపై గతంలో జరిగిన రంజీ, వన్డే మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అప్పుడు సల్గాన్కర్‌ పిచ్ తయారు చేశాడు. తాజా మ్యాచ్‌లో ఎందుకిలా జరిగిందన్నది సందేహాలకు తావిస్తోంది.

పుణె టెస్టులో బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ సేనతో పోలిస్తే స్టీవ్ స్మిత్ గ్యాంగ్ కాస్త మెరుగనిపించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో రెన్‌షా, స్టార్క్ హాఫ్ సెంచరీలు చేయడం, రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సెంచరీతో ఆదుకోవడంతో ఆసీస్ మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా స్కోరు 300 దాటలేదు.
 

Advertisement
Advertisement