బంగ్లా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని | Sakshi
Sakshi News home page

బంగ్లా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని

Published Wed, May 29 2019 6:05 PM

Dhoni Stops Bowler Sets Field For Bangladesh While Batting - Sakshi

కార్డిఫ్‌: సారథిగా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు ఎంఎస్‌ ధోని. బెస్ట్‌ ఫినిషర్‌గా, గొప్ప నాయకుడిగా పేరు గాంచిన ధోని మైదానంలో చాలా ఆక్టీవ్‌గా, అలర్ట్‌గా ఉంటాడు. టీమిండియా సారథ్య బాధ్యతలు కోహ్లికి అప్పగించినప్పటికీ మైదానంలో ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తూ, బౌలర్లకు సలహాలు ఇస్తుంటాడు. ప్రస్తుత టీమిండియా సారథి కోహ్లి కూడా ధోని సూచనలను కాదనకుండా పాటిస్తాడు. ఇక టీమిండియా ఆటగాళ్లే కాకుండా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ధోని సూచనలను పాటిస్తున్నారు. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది.
కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ 40వ ఓవ‌ర్‌లో బౌల‌ర్ షబ్బీర్‌ రహ్మాన్‌ బౌలింగ్ చేస్తుండ‌గా.. క్రీజులో ఉన్న ధోని బౌలర్‌ను ఆపి ఒక సారి ఫీల్డింగ్ చూసుకోమన్నాడు. మిడ్ వికెట్‌లో ఉన్న ఫీల్డ‌ర్‌ను స్వేర్‌ లెగ్‌కు మార్చమని సలహా ఇచ్చాడు. అయితే ధోని చెప్పడంతో షబ్బీర్‌ ఏ మాత్రం ఆలోచించకుండా కనీసం కెప్టెన్‌కు చెప్పకుండానే ఫీల్డర్‌ను మార్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘ధోని చెబితే ప్రత్యర్థి జట్లు కూడా వినాల్సిందే’, ‘ధోని మీద నమ్మకంతో ఫీల్డింగ్‌ మార్చిన షబ్బీర్‌కు హ్యాట్సాఫ్‌’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
బ్యాటింగ్‌ చేస్తూ.. బంగ్లా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని

ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 359 ప‌రుగులు చేసింది.  మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెటరన్‌ ధోని (78 బంతుల్లో 113; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాలతో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో గెలుపొందింది.

Advertisement
Advertisement