శ్రీనివాసన్ రాకతో... | Sakshi
Sakshi News home page

శ్రీనివాసన్ రాకతో...

Published Sat, Aug 29 2015 1:12 AM

శ్రీనివాసన్ రాకతో...

 కోల్‌కతా: భారత క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే దీనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ప్రతినిధిగా మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరు కావడమే దీనికి కారణం. శ్రీనివాసన్ దీనికి హాజరు కావొచ్చా లేదా అనేదానిపై తాము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ వివాదం నేపథ్యంలో గతంలో బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ పోటీ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆయన ఈ సమావేశానికి ఎలా వస్తారని కొందరు సభ్యులు వాదించడంతో వివాదం చోటు చేసుకుంది.
 
  అయితే జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయం ప్రకారం తనకా హక్కు ఉందని శ్రీనివాసన్ తన రాకను సమర్థించుకున్నారు. దీనిపై మరింత వాదన జరగడంతో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని రద్దు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో బోర్డు మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లోధా కమిటీ సిఫారసులపై చర్చ, వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడే జట్లపై నిర్ణయం, జాతీయ క్రికెట్ అకాడమీ తరలింపు, భారత జట్టు కోచ్ ఎంపిక తదితర అంశాలు ఈ సమావేశం అజెండాలో ఉన్నాయి. మరో వైపు వార్షిక అకౌంట్ల ఆమోదం మినహా బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో కూడా ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు.
 

Advertisement
Advertisement