ఆనంద్‌ గేమ్‌ డ్రా

9 Apr, 2019 05:43 IST|Sakshi

షంకిర్‌ (అజర్‌బైజాన్‌): భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’ ఫలితమే ఎదురైంది. వుగర్‌ గషిమోవ్‌ మెమోరియల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో సోమవారం తైముర్‌ రద్జబొవ్‌ (అజర్‌బైజాన్‌)తో జరిగిన  ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ డ్రా చేసుకున్నాడు. నల్లపావులతో బరిలోకి దిగిన భారత ఆటగాడు గెలుపుకోసం చేసిన ఎత్తులేవీ ఫలించలేదు. దీంతో 33 ఎత్తుల వరకు సాగిన ఈ గేమ్‌ చివరకు డ్రాగా ముగిసింది. తాజా ఫలితంతో ఆనంద్‌ 4 పాయింట్లతో తైముర్‌తో పాటు ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నార్వే సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ టైటిల్‌ వేటలో మళ్లీ విజయవంతమయ్యాడు. సెర్గీ కర్యాకిన్‌ (రష్యా 4.5)తో జరిగిన గేమ్‌లో గెలుపొందిన కార్ల్‌సన్‌ 6 పాయింట్లతో ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్‌ (రష్యా; 4.5)... డేవిడ్‌ నవర (చెక్‌ రిపబ్లిక్‌; 3.5)పై నెగ్గగా, అనిశ్‌ గిరి (నెదర్లాండ్స్‌; 2.5)... షకిరియార్‌ (అజర్‌బైజాన్‌; 3)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.  

మరిన్ని వార్తలు