హైదరాబాద్‌ బోణీ చేసేనా! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ బోణీ చేసేనా!

Published Tue, Oct 24 2017 10:55 AM

hyderabad ready to fight against karnataka in ranji trophy - Sakshi

షిమోగా: దేశవాళీ రంజీ సీజన్‌ మొదలై అప్పుడే మూడో రౌండ్‌ మ్యాచ్‌దాకా వచ్చింది. కానీ దురదృష్టం మాత్రం హైదరాబాద్‌ను వెంటాడుతోంది. సొంతగడ్డపై జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో తుడిచి పెట్టేసింది. కనీసం బరిలోకి దిగే అవకాశం కూడా రాలేదు. దీంతో బోణీ కొట్టడం అటుంచి ప్యాడ్‌ కట్టుకునే చాన్స్‌ దక్కితే చాలని బ్యాట్స్‌మెన్, బంతి పట్టాలని బౌలర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి షిమోగాలో కర్ణాటకతో మొదలయ్యే మూడో రౌండ్‌ మ్యాచ్‌తోనైనా మైదానంలోకి దిగాలని హైదరాబాద్‌ ఆటగాళ్లు భావిస్తున్నారు.

ఈ సీజన్‌లో హైదరాబాద్‌ వెలుపల జరగనున్న తొలి మ్యాచ్‌ కూడా ఇదే కావడం గమనార్హం. బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టుకు ఎంపికైన తన్మయ్‌ అగర్వాల్, బావనాక సందీప్, ఆకాశ్‌ భండారి, సీవీ మిలింద్, రవికిరణ్‌లు రెట్టించిన ఉత్సాహంతో కర్ణాటకతో తలపడేందుకు సై అంటున్నారు. పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు మొదటిసారిగా అంతర్జాతీయ టి20 ఆడే అవకాశం లభించింది. త్వరలో టీమిండియా సభ్యుడు కాబోతున్న ఈ పేసర్‌ కర్ణాటకపై చెలరేగాలని తహతహలాడుతున్నాడు. అయితే అంబటి రాయుడు సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టుకు కర్ణాటకతో పోరు అంత సులభమేం కాదు. ఇప్పటికే ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్‌ తేడాతో బోణీ కొట్టిన ఆ జట్టుకు భారత క్రికెటర్లు లోకేశ్‌ రాహుల్, కరుణ్‌ నాయర్‌ అందుబాటులోకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా బ్యాటింగ్‌ బలం పెరిగిన కర్ణాటక మరో విజయంపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు మ్యాచ్‌ ప్రాక్టీసే లేని హైదరాబాద్‌పై తొలిరోజు నుంచే పైచేయి సాధించాలని ఆశిస్తోంది.   

జట్లు:

హైదరాబాద్‌: రాయుడు (కెప్టెన్‌), కొల్లా సుమంత్, తన్మయ్, ఆకాశ్‌ భండారి, సందీప్, ఆశిష్‌ రెడ్డి, అక్షత్‌ రెడ్డి, మెహదీ హసన్, సీవీ మిలింద్, సిరాజ్, రవి కిరణ్, ప్రజ్ఞాన్‌ ఓజా, రోహిత్‌ రాయుడు.
కర్ణాటక: వినయ్‌ కుమార్‌ (కెప్టెన్‌), లోకేశ్‌ రాహుల్, కరుణ్‌ నాయర్, మయాంక్‌ అగర్వాల్, అరవింద్, స్టువర్ట్‌ బిన్నీ, గౌతమ్, మిథున్, సమర్థ్, శరత్, గోపాల్, పవన్‌ దేశ్‌పాండే, నిశ్చల్‌.

Advertisement
Advertisement