కోహ్లి 'కమాల్ చూపించాలి ! | Sakshi
Sakshi News home page

కోహ్లి 'కమాల్ చూపించాలి !

Published Mon, Mar 23 2015 12:12 AM

కోహ్లి 'కమాల్ చూపించాలి !

ధావన్ దక్షిణాఫ్రికాపై దంచేశాడు... రైనా జింబాబ్వేపై చెలరేగాడు... రోహిత్ శర్మ నాకౌట్‌లో సత్తా చాటాడు... ఇక రహానే కూడా అతనిపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే రాణించాడు. కానీ ఇప్పటి వరకు టాప్-5లో తనదైన ముద్ర చూపించలేకపోయింది స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఒక్కడే. పాక్‌పై సెంచరీ చేసినా అది అతని స్థాయికి తగ్గట్లు ‘సింగిల్ హ్యాండ్‌‘ ఇన్నింగ్స్ కాదు. ప్రపంచకప్‌లో అతడి నుంచి అభిమానులు ఒక ప్రత్యేకమైన ప్రదర్శనను ఆశిస్తున్నారు. అలాంటి, ఇలాంటి మ్యాచ్‌లో కాదు... ఆ అద్భుత ఇన్నింగ్స్ సెమీఫైనల్లోనే వస్తే ఎలా ఉంటుంది! నిజంగా అదే జరిగితే భారత్‌కు తిరుగుండదు. ఎందుకంటే కోహ్లి కొట్టాడంటే ప్రత్యర్థి ఎవరైనా మన గెలుపు మాత్రం గ్యారంటీ అని చెప్పవచ్చు.
 
సాక్షి క్రీడా విభాగం
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లోనే కోహ్లి 107 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత అతని బ్యాట్ నుంచి మరో చెప్పుకోదగ్గ స్కోరు రాలేదు. పాక్‌తో సెంచరీ తర్వాత కోహ్లి వరుసగా 46, 33 నాటౌట్, 33, 44 నాటౌట్, 38, 3 పరుగులు చేశాడు. వీటిలో చిన్న లక్ష్యాలు ఉన్న యూఏఈ, ఐర్లాండ్ మ్యాచ్‌లలో నాటౌట్ మినహా మిగిలిన స్కోర్లు చూస్తే అతను పెద్దగా రాణించనట్లే లెక్క. ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్లో లక్ష్యఛేదనలో కోహ్లి వైఫల్యం కాస్త ఆందోళన కలిగించింది. రూబెల్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు బంతులు పరుగు చేయకుండా, దూరంగా వెళుతున్న తర్వాతి బంతిని వెంటాడి అతను అవుటయ్యాడు. అయితే ఈ విషయంలో కోహ్లికి కెప్టెన్ అండగా నిలిచాడు. ‘కోహ్లి షాట్ ఎంపికను తప్పు పట్టలేం. ఎందుకంటే తనదైన స్ట్రోక్స్ ఆడుతూ, ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించగల బ్యాట్స్‌మన్ అతను. నా దృష్టిలో కోహ్లి బాగానే ఆడుతున్నాడు’ అని ధోని అన్నాడు.
 
రికార్డులే చెబుతున్నాయి...
కోహ్లి బాగా ఆడాడంటే ఇక భారత్ గెలుపు ఖాయమనేది ఎన్నో సార్లు నిరూపితమైంది. అది ముందుగా బ్యాటింగ్ చేసినా, ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా విజయాన్ని అందించడంలో విరాట్ తర్వాతే ఎవరైనా. అతను చేసిన 22 సెంచరీల్లో 20 సార్లు భారత్ గెలిచిందంటే కోహ్లి ఆధిపత్యం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ గెలిచిన మ్యాచ్‌లలో కోహ్లి బ్యాటింగ్ సగటు ఏకంగా 68.74 కావడం విశేషం. నిజానికి ఈ ప్రపంచకప్‌లో ధావన్ (367) తర్వాత భారత్ తరఫున కోహ్లినే (304) ఎక్కువ పరుగులు చేశాడు.  

ఇన్నేళ్లుగా తన బ్యాటింగ్‌కు సంబంధించి కోహ్లి సొంత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇందులో ఎక్కువ భాగం అతను ఎప్పటికీ గుర్తుంచుకోదగిన, జట్టును నిలబెట్టిన ఇన్నింగ్స్‌లు ఆడాడు. బహుశా దాని కారణంగానే అతను ఇప్పుడు విఫలమైనట్లుగా కనిపిస్తోంది. ‘ఇటీవల టెస్టు సిరీస్‌లో కోహ్లి కొట్టిన సెంచరీలతో ప్రపంచకప్ మ్యాచ్‌లను పోలుస్తున్నట్లుగా ఉంది. అందుకే అతని స్కోర్లు చిన్నవిగా కనిపిస్తున్నాయి. ప్రతీ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఏ ఆటగాడికీ సాధ్యం కాదు’ అని ధోని వ్యాఖ్యానించడం విరాట్‌పై ఉన్న అంచనాల గురించి చెబుతోంది.
 
అసలు మ్యాచ్‌లో ఆడితే...

ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టుతో సెమీఫైనల్ మ్యాచ్ గెలవాలంటే అంత సులభం కాదు. ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 300కు పైగా పరుగులు చేయాల్సిందే. రెండో ఇన్నింగ్స్ ఆడినా దాదాపు అదే స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించాల్సి రావచ్చు. అంటే ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు ఖచ్చితంగా సెంచరీ సాధించాలి. మరో ఇద్దరు అతనికి అండగా నిలవాల్సి ఉంటుంది.
 
గతానుభవం, రికార్డులు చూస్తే ఈసారి ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే కావాలి. ఆసీస్‌పై 15 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 51.66 సగటుతో 620 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘ఇతర భారత బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఈసారి కోహ్లినే ఆడాల్సి ఉంది. ప్రపంచకప్ ముందునుంచీ తనపై ఉంచిన నమ్మకాన్ని అతను నిలబెట్టాల్సిన సమయమిదే. అతను విఫలమైతే జట్టుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది’ అని మాజీ ఆటగాడు జవగల్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు.

అయితే గణాంకాలకు మించి కంగారూలకు ఎదురొడ్డి నిలిచే సత్తా కోహ్లికే సొంతం. ఆటతో దూకుడు, మాటతో సమాధానం, దేనికైనా సిద్ధమనే మొండితనాన్ని టెస్టు సిరీస్‌లోనే ఆసీస్ రుచి చూసింది. అక్కడ భారత్ అడుగు పెట్టి నాలుగు నెలలైంది. కానీ ఆస్ట్రేలియాపై ఒక్క విజయమూ దక్కలేదు. ఇదిగో... ఇప్పుడు ఈ కసే కోహ్లిలో పట్టుదల పెంచవచ్చు.
 
ఒకే దెబ్బతో అన్ని రకాలుగా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలంటే ప్రపంచకప్ సెమీస్‌ను మించిన వేదిక ఏముంటుంది. ‘గొప్ప ఆటగాళ్ల ప్రదర్శన కీలక మ్యాచ్‌లలోనే బయటపడుతుంది. అది ఎంతో దూరంలో లేదు’ అంటూ విరాట్ తరఫున కెప్టెన్ ధోని ప్రత్యర్థులకు ఇప్పటికే హెచ్చరిక పంపించాడు. మరి గురువారం మ్యాచ్‌లో విరాట్ విశ్వరూపం ప్రదర్శిస్తాడా, భారత్‌ను ఫైనల్ చేరుస్తాడా!

Advertisement
Advertisement