చివరి వన్డే..నెం.1 ర్యాంకు.. భారత్‌దే | Sakshi
Sakshi News home page

చివరి వన్డే..నెం.1 ర్యాంకు.. భారత్‌దే

Published Sun, Oct 1 2017 8:51 PM

India won by 7 wickets against australia - Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్‌ సెంచరీ, రహానే హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ​భారత్‌ 4-1తో సిరీస్‌తో పాటు వన్డేల్లో నెం.1 ర్యాంకును సుస్థిరం చేసుకుంది. 243 పరుగుల సునాయస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు అర్ధసెంచరీలతో మంచి శుభారంబాన్ని అందించారు.  దూకుడుగా ఉన్న ఈ జంటను కౌల్టర్‌ నీల్‌ రహానే 61 (74 బంతులు; 7 ఫోర్లు)ను అవుట్‌ చేసి విడగొట్టాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లితో రోహిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కమిన్స్‌ వేసిన 32 ఓవర్‌ ఐదో బంతిని సింగిల్‌ తీసిన రోహిత్‌ అంతార్జాతీయ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయి అందుకున్న తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ దశలో 94 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సులతో కెరీర్‌లో 14వ సెంచరీ నమోదు చేసిన రోహిత్‌ 125(109 బంతులు 11 ఫోర్లు, 5 సిక్సులు) జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కౌల్టర్‌ నీల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో రెండో వికెట్‌కు 99 పరుగుల జమయ్యాయి. మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే కెప్టెన్‌ కోహ్లి కూడా జంపా బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జాదవ్(5)‌, పాండె(11)లతో 42.5 ఓవర్లలోనే భారత్‌ విజయాన్నందుకుంది. ఆసీస్‌ బౌలర్లలో జంపాకు రెండు, కౌల్టర్‌ నీల్‌కు ఒక వికెట్‌ దక్కింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ వార్నర్ ‌(53), స్టోయినీస్‌(46), ట్రావిస్‌ హెడ్(42)‌, ఫించ్(32), లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఇక సెంచరీతో విజృంభించిన రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ రాగా.. సిరీస్‌ ఆసాంతం ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వరించింది.

Advertisement
Advertisement