స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత | Sakshi
Sakshi News home page

స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత

Published Sun, Aug 14 2016 2:21 AM

స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత

రియో డి జనీరో: జాతీయ రికార్డును బద్దలు కొట్టిన భారత మహిళా అథ్లెట్ లలితా శివాజీ బబర్ రియో ఒలింపిక్స్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో హీట్-2లో పాల్గొన్న లలిత 9 నిమిషాల 19.76 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 26.55 సెకన్లతో సుధా సింగ్ పేరిట ఉన్న జాతీయ రికార్డును లలిత తిరగరాసింది. హీట్-3లో బరిలోకి దిగిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సుధా సింగ్ 9 నిమిషాల 43.29 సెకన్లలో లక్ష్యానికి చేరి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
 
 ఓవరాల్‌గా లలిత ఏడో స్థానంలో, సుధా సింగ్ 30వ స్థానంలో నిలిచారు. మొత్తం 15 మంది పాల్గొనే ఫైనల్ రేసు సోమవారం (15న) జరుగుతుంది. తాజా ఫలితంతో లలిత బబర్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఫైనల్‌కు చేరిన ఎనిమిదో అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. గతంలో మిల్కా సింగ్, గుర్‌బచన్ సింగ్ రణ్‌ధావ, శ్రీరామ్ సింగ్, పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్ (లాంగ్‌జంప్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), వికాస్ గౌడ (డిస్కస్ త్రో) మాత్రమే భారత్ నుంచి ఫైనల్ ఈవెంట్‌కు అర్హత సాధించారు.
 
 హీట్స్‌లో ద్యుతీ చంద్ అవుట్
 మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. హీట్-5లో పాల్గొన్న ద్యుతీ 11.69 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్-7లో పాల్గొని 45.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల లాంగ్‌జంప్‌లో అంకిత్ శర్మ (7.67 మీటర్లు) 12వ స్థానంలో, మహిళల 400 మీటర్ల విభాగంలో నిర్మల 44వ స్థానంలో నిలిచింది.
 
 మహిళల హాకీ జట్టుకు నిరాశ
 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. అర్జెంటీనాతో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తమ గ్రూప్‌లో చివరిదైన ఆరో స్థానంతో సంతృప్తి పడింది.
 
 షూటర్లకు దురదృష్టం
 షూటింగ్ విభాగంలో భారత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో గుర్‌ప్రీత్ సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. టాప్-6లో నిలిచిన వారే ఫైనల్‌కు చేరుతారు. పురుషుల స్కీట్ విభాగంలో మేరాజ్ అహ్మద్ ఖాన్ ‘షూట్ ఆఫ్’లో విఫలమై సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయాడు.  
 
 రోయర్ దత్తూకు 15వ స్థానం
 రోయింగ్‌లో దత్తూ బబన్ భోకనాల్ ఓవరాల్‌గా 15వ స్థానంలో నిలిచాడు. సింగిల్ స్కల్స్ ర్యాంకింగ్ రేసులో దత్తూ 6 నిమిషాల 54.96 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
 
 ఓటమితో ముగించిన జ్వాల జంట
 మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్న జంట చివరిదైన మూడో మ్యాచ్‌లో 17-21, 15-21 తో పుట్టిటా-సప్‌సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది.

 

Advertisement
Advertisement