సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ | Sakshi
Sakshi News home page

సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్

Published Tue, Nov 10 2015 12:03 AM

సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్

రోజర్ బిన్నీపై వేటు
వైజాగ్‌కు టెస్టు హోదా


ముంబై: భారత క్రికెటర్ సీనియర్ సెలక్షన్ కమిటీలో భారత మాజీ వికెట్ కీపర్, ఆంధ్రకు చెందిన మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్‌కు చోటు లభించింది. సౌత్ జోన్‌నుంచి ఇప్పటి వరకు సెలక్టర్‌గా ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ కమిటీలో చైర్మన్ సందీప్ పాటిల్‌తో పాటు విక్రమ్ రాథోడ్, సబా కరీం కొనసాగనుండగా...సెంట్రల్‌జోన్ నుంచి రాజీందర్ సింగ్ హన్స్ స్థానంలో రాజస్థాన్ మాజీ ఆటగాడు గగన్ ఖోడాకు అవకాశం దక్కింది. ఖోడా భారత్ తరఫున ఓపెనర్‌గా 2 వన్డేలు ఆడారు. తండ్రి సెలక్టర్ కావడం వల్ల స్టువర్ట్ బిన్నీ కెరీర్‌పై ప్రభావం పడుతోందని, అతను తన ప్రతిభతో ఎంపికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడని ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు మనోహర్ అభిప్రాయ పడ్డారు. అందు వల్లే రోజర్ బిన్నీని తప్పించామని, మున్ముందు స్టువర్ట్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని, అతను స్వేచ్ఛగా ఆడవచ్చని ఆయన అన్నారు.

 ఆరు కొత్త టెస్టు వేదికలు
 ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)కు ఆనందం కలిగించే మరో నిర్ణయాన్ని బోర్డు ఏజీఎంలో తీసుకున్నారు. విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంకు టెస్టు హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. వైజాగ్‌తో పాటు పుణే, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాల, రాంచీ కూడా టెస్టు వేదికలు కానున్నాయి. ఈ వన్డే వేదికల్లో టెస్టుల నిర్వహణకు తగిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయని బోర్డు అభిప్రాయ పడింది. వైజాగ్‌లో ఇప్పటివరకు ఐదు వన్డేలు జరిగాయి.  ఏసీఏ కార్యదర్శి, బీసీసీఐ ఉపాధ్యక్షుడు అయిన గోకరాజు గంగరాజు టూర్ ప్రోగ్రామ్ అండ్ ఫిక్స్‌చర్స్ కమిటీ చైర్మన్‌గా కూడా ఎంపికయ్యారు.

Advertisement
Advertisement