Sakshi News home page

ముంబై మ్యాజిక్

Published Fri, May 15 2015 1:44 AM

ముంబై మ్యాజిక్

ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై విజయం  
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం
చెలరేగిన పాండ్య  రాణించిన పొలార్డ్

 
 ఆహా... ఏం మ్యాచ్..! చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై సంచలనాత్మకంగా ఆడింది. తొలుత బ్యాటింగ్‌లో తడబడ్డా... యువ పాండ్యా వీరోచిత బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఓటమి అంచుల్లోంచి కోలుకుని ఆఖరి ఓవర్లో అద్భుతంగా గెలిచింది. ఫలితంగా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుని, కోల్‌కతానూ ఒత్తిడిలోకి నెట్టింది.
 
 ముంబై : ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. యువ సంచలనం హార్థిక్ పాండ్య (31 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) మరోసారి అసమాన బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరుకు బాటలు వేయగా.. బౌలింగ్‌లో చివరి ఓవర్‌లో పొలార్డ్ అద్భుతమే చేశాడు. ఫలితంగా వాంఖడే మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది.

పొలార్డ్ (38 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్), రోహిత్ (21 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించారు. షకీబ్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. గంభీర్ (29 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

 పాండ్య హల్‌చల్
 కోల్‌కతా బౌలర్లు ప్రారంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైకి ఆదిలోనే షాక్ ఇచ్చారు. ఉన్న కాసేపు వేగంగా ఆడిన ఓపెనర్ పార్థీవ్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను షకీబ్ అవుట్ చేయగా మరుసటి ఓవర్‌లోనే లెండిల్ సిమ్మన్స్ (16 బంతుల్లో 14; 1 ఫోర్; 1 సిక్స్) ఓ సిక్స్ బాదిన అనంతరం మోర్కెల్‌కు చిక్కాడు. ఇక ఫామ్‌లో ఉన్న రాయుడు (2)ను షకీబ్ తన రెండో ఓవర్‌లో అవుట్ చేయడంతో ముంబై 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ రోహిత్, పొలార్డ్ కలిసినా ఇన్నింగ్స్‌లో వేగం పెరగలేదు. 12వ ఓవర్‌లో నరైన్ అద్భుత బంతితో రోహిత్‌ను బౌల్డ్ చేశాడు. అయితే పాండ్యా రాకతో ముంబై ఇన్నింగ్స్‌కు అసలైన ఊపు వచ్చింది. అప్పటిదాకా నత్తనడకన సాగిన జట్టు ఆట తన బ్యాటింగ్‌తో రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. పొలార్డ్‌ను మించి దూకుడును కనబరిచిన తను ఉమేశ్ వేసిన 17వ ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లతో రెచ్చిపోగా నరైన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. రస్సెల్ వేసిన 19వ ఓవర్‌లో 4,4,6తో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు రాగా ఇందులో 50 పరుగులు పాండ్యావే కావడం విశేషం. ఈజోరుతో ఐదో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు వచ్చాయి.

 పఠాన్ దూకుడు
 భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా ఆరో ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఊపు మీదున్న ఉతప్ప (20 బంతుల్లో 25; 3 ఫోర్లు; 1 సిక్స్) భజ్జీ వేసిన ఆ ఓవర్‌లో సిక్స్ బాదినా ఆ తర్వాత బంతికి మలింగ క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడు. అటు మనీష్ పాండే (1) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. సుచిత్ బౌలింగ్‌లో యూసుఫ్ పఠాన్ భారీ సిక్స్ కొట్టగా అదే ఓవర్‌లో ఫోర్  బాదిన గంభీర్ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో పఠాన్‌తో కలిసి షకీబ్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు) వేగంగా ఆడాడు.

చక్కటి ఫోర్లతో ప్రమాదకరంగా మారుతున్న దశలో డీప్ మిడ్‌వికెట్‌లో పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. రస్సెల్ (2) విఫలమయ్యాడు. 17వ ఓవర్‌లో సూర్యకుమార్ రెండు ఫోర్లు, పఠాన్ ఓ ఫోర్‌తో 14 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ అద్భుతమే చేశాడు. పఠాన్‌ను తొలి బంతికే అవుట్ చేయడంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది. పీయూష్ చావ్లా చివర్లో బంతులను వృథా చేసి కోల్‌కతా ఓటమికి కారణమయ్యాడు.
 
 రేసు మరింత రసవత్తరం
 ఇక మూడు రోజుల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఐదే మ్యాచ్‌లు మిగిలున్నాయి. కానీ ప్లేఆఫ్‌కు వెళ్లే జట్ల విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుతం చెన్నై 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరినట్లే. కోల్‌కతా (15), రాజస్తాన్(14), బెంగళూరు (13), ముంబై (14), సన్‌రైజర్స్ (14)... ఐదు జట్లూ మూడు బెర్త్‌ల కోసం రేసులో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు జట్లకు రెండేసి మ్యాచ్‌లు ఉన్నాయి. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఏ జట్టైనా కనీసం మరో మ్యాచ్ గెలవాలి. మొత్తం మీద లీగ్ ఆఖరి మ్యాచ్ (సన్‌రైజర్స్‌తో ముంబై)వరకు ప్లేఆఫ్‌కు చేరే జట్ల విషయంలో స్పష్టత రాదు.
 
 స్కోరు వివరాలు
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (సి) పాండే (బి) మోర్కెల్ 14; పార్థీవ్ (సి) పాండే (బి) షకీబ్ 21; రోహిత్ (బి) నరైన్ 30; రాయుడు (సి) రస్సెల్ (బి) షకీబ్ 2; పొలార్డ్ నాటౌట్ 33; పాండ్య నాటౌట్ 61; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171.
 వికెట్ల పతనం : 1-29, 2-42, 3-47, 4-79.
 బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 3-0-37-0; మోర్కెల్ 4-0-27-1; షకీబ్ 4-0-22-2; చావ్లా 1-0-9-0; నరైన్ 4-0-38-1; రస్సెల్ 4-0-37-0.

 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : ఉతప్ప (సి) మలింగ (బి) హర్భజన్ 25; గంభీర్ (బి) సుచిత్ 38; పాండే (రనౌట్) 1; పఠాన్ (సి) పార్థీవ్ (బి) పొలార్డ్ 52; షకీబ్ (సి) పాండ్య (బి) వినయ్ 23; రస్సెల్ (సి) పార్థీవ్ (బి) మలింగ 2; యాదవ్ (సి) రాయుడు (బి) మెక్లెనెగాన్ 11; చావ్లా నాటౌట్ 1; ఉమేశ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166.
 వికెట్ల పతనం : 1-45, 2-46, 3-88, 4-118, 5-128, 6-144, 7-160.
 బౌలింగ్ : మలింగ 4-0-31-1; మెక్లెనెగాన్ 4-0-31-1; వినయ్ 4-0-33-1; హర్భజన్ 4-0-31-1; సుచిత 2-0-23-1; పాండ్య 1-0-10-0; పొలార్డ్ 1-0-6-1.
 
గురువారం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సచిన్, అమితాబ్‌లను ఇంటర్వ్యూ చేస్తున్న గవాస్కర్

Advertisement

What’s your opinion

Advertisement