విరాట్ సేనకు అడ్డు గోడలా..! | Sakshi
Sakshi News home page

విరాట్ సేనకు అడ్డు గోడలా..!

Published Sat, Feb 11 2017 4:39 PM

విరాట్ సేనకు అడ్డు గోడలా..!

హైదరాబాద్: ఇటీవల కాలంలో స్వదేశంలో భారత్ క్రికెట్ జట్టును నిలువరించాలంటే ఏ విదేశీ జట్టుకైనా కష్టంగానే ఉంది. న్యూజిలాండ్ , ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్లు సైతం ఇక్కడ భారత్ ను  ఎదుర్కోవడానికి అపసోపాలు పడ్డాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో పసికూన బంగ్లాదేశ్ మాత్రం భారత్ కు దీటుగా బదులిస్తోంది. ఏ మాత్రం తడబాడు లేకుండా భారత బౌలర్లను అసహనానికి గురి చేస్తోంది.   ప్రధానంగా బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్, మిడిల్ ఆర్డర్ ఆటగాడు మెహిదీ హసన్ మిరాజ్ లు విరాట్ సేనకు అడ్డు గోడలా నిలబడి పరీక్షగా నిలిచారు. వీరిద్దరూ  50.0 ఓవర్లకు పైగా భారత బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడటం వారి స్ఫూర్తిదాయకమైన ఆట తీరుకు అద్దం పడుతోంది.



41/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుంది. బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(24) ఆరంభంలోనే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరువాత కాసేపటికి మొనిముల్ హక్(12), మొహ్మదుల్లా(28)లు నిష్క్రమించారు. దాంతో లంచ్ సమయానికి బంగ్లాదేశ్ నాలుగు ప్రధాన వికెట్లను నష్టపోయి 125 పరుగులు చేసింది. కాగా, ఆ తరుణంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ -షకిబుల్ హసన్లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ అత్యంత బాధ్యతగా ఆడుతూ బంగ్లా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 

 

ఈ క్రమంలోనే షకిబుల్ (82;103 బంతుల్లో 14 ఫోర్లు) రాణించి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ జోడి 107 పరుగుల్ని సాధించడంతో బంగ్లాదేశ్ గాడిలో పడింది. షకిబుల్ అవుటైన స్వల్ప వ్యవధిలో  మరో కీలక ఆటగాడు షబ్బీర్ రెహ్మాన్(16) కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికి బంగ్లా స్కోరు 235. అయితే ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ముష్పికర్ తో జత కలిసిన మొహిది హసన్ మిరాజ్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మూడో రోజు ఆటలో ఈ జోడి మొత్తంగా 309 బంతుల్ని ఎదుర్కోవడం ఇక్కడ విశేషం. ఈ క్రమంలో ముష్పికర్ తొలుత హాఫ్ సెంచరీ చేయగా, ఆపై మిరాజ్ కూడా అర్థ శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ అజేయంగా 87 పరుగుల్ని జత చేయడంతో బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ముష్ఫికర్(81 బ్యాటింగ్;206 బంతుల్లో 12 ఫోర్లు), మెహిది హసన్ మిరాజ్(51 బ్యాటింగ్;103 బంతుల్లో 10 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు.

Advertisement
Advertisement