పింక్‌ బాల్‌ క్రికెట్‌: మనోళ్ల సత్తా ఎంత? | Sakshi
Sakshi News home page

పింక్‌ బాల్‌ క్రికెట్‌: మనోళ్ల సత్తా ఎంత?

Published Wed, Nov 20 2019 1:09 PM

Pink Ball Cricket: How Team India Players Have Fared - Sakshi

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ తొలి డేనైట్‌ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్జెన్స్‌ ఆతిథ్యమిస్తోంది. డేనైట్‌ టెస్టు కోసం రెగ్యులర్‌గా వాడే రెడ్‌ బాల్స్‌కు బదులు పింక్‌ బాల్స్‌ను వాడతారు. దీంతో ఈ రెండు బంతుల మధ్య తేడా ఏంటి, పింక్‌ బాల్‌తో మనోళ్లు నెగ్గుకరాగలరా? అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. సారథి విరాట్‌ కోహ్లి, వైఎస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తొలిసారి పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడనుండటం విశేషం.

అయితే ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తొలుత బెంగళూరులో రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అనంతరం కోల్‌కతాలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన అనుభవం కొంతమందికి ఉండటం టీమిండియాకు లాభించే అంశం. ఎవరు, ఎక్కడ పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడారో చూద్దాం..

మహ్మద్‌ షమీ: ప్రతీ ఒక్కరి దృష్టి ఈ మీడియం పేసర్‌ పైనే ఉంది. ఎందుకంటే పింక్‌ బాల్‌ రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో రివర్స్‌ స్వింగ్‌ సుల్తాన్‌ అయిన షమీ బంగ్లా పని పడతాడని భావిస్తున్నారు. క్రికెట్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) సూపర్‌ లీగ్‌ ఫైనల్లో పింక్‌ బంతులను ఉపయోగించారు. ఈ మ్యాచ్‌లో షమీ రెచ్చి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ఈ అనుభవంతో బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో షమీపైనే అందరి దృష్టి ఉంది. 

వృద్దిమాన్‌ సాహా: క్యాబ్‌ సూపర్‌ లీగ్‌ ఫైనల్లో భాగంగా వృద్దిమాన్‌ సాహా పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. 

రవీంద్ర జడేజా: ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో పింక్‌ బాల్‌ క్రికెట్‌లో ఈ ఆల్‌రౌండర్‌ ప్రధాన ఆయుధంగా కానున్నాడు. దులీప్‌ ట్రోఫీ-2016లో భాగంగా పింక్‌ బంతులను వాడారు. ఈ టోర్నీలో రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో 48, 17 పరుగులు సాధించాడు.

మయాంక్‌ అగర్వాల్‌: పింక్‌ బాల్‌ క్రికెట్‌లో ఇతడు టీమిండియా స్టార్‌ అనే చెప్పాలి. 92,161,58,57,52 వరుసగా మయాంక్‌ సాధించిన పరుగులు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 419 పరుగులు సాధించాడు. దీంతో బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో మయాంక్‌ కీలకం కానున్నాడు.  

రోహిత్‌ శర్మ: దులీప్‌ ట్రోఫీ-2016లో భాగంగా ఇండియా బ్లూ తరుపున బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో 30,32 పరుగులు సాధించాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా రెడ్‌పై 335 పరుగుల తేడాతో ఇండియా బ్లూ ఘన విజయం సాధించింది.

చటేశ్వర పుజారా: టెస్టు బ్యాట్స్‌మన్‌గా ప్రసి​ద్ది గాంచిన చటేశ్వర పుజారా దేశవాళీ పింక్‌ బాల్‌ క్రికెట్‌లో అదరగొట్టాడు. దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా రెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా బ్లూ బ్యాట్స్‌మన్‌ పుజారా ఏకంగా 256 పరుగులు సాధించాడు.  ఇప్పటివరకు పింక్‌ బాల్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌ పుజారానే కావడం విశేషం. దీంతో పుజారా అనుభవం బంగ్లా మ్యాచ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంది. 

ఇషాంత్‌ శర్మ: దులీప్‌ ట్రోఫీ-2016లో భాగంగా ఓ మ్యాచ్‌ ఆడిన ఇషాంత్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతేకాకుండా 9 పరుగులు సాధించాడు. 

ఇక కుల్దీప్‌ యాదవ్‌ దులీప్‌ ట్రోపీ-2016లో 11 వికెట్లు పడగొట్టి బౌలర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.కాగా, హనుమ విహారీ, రిషభ్‌ పంత్‌లు దులీప్‌ ట్రోఫీ-2017లో ఆడిన ఆనుభవం ఉంది. ఈ టోర్నీలో విహారీ 105 పరుగులు సాధించగా, పంత్‌ 72 పరుగులు మాత్రమే సాధించాడు. వీరి అనుభవం టీమిండియా డబుల్‌ ప్లస్‌ కానుంది. 


Advertisement
Advertisement