10 వికెట్లూ ఒక్కడికే... | Sakshi
Sakshi News home page

10 వికెట్లూ ఒక్కడికే...

Published Sun, Dec 1 2013 1:33 AM

10 వికెట్లూ ఒక్కడికే...

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు.
 
 
 23 ఏళ్ల ఈ ఢిల్లీ ప్లేయర్ మొత్తం 28.5 ఓవర్లు వేసి 77 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో రైల్వేస్ జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న ఠాకూర్.... ఆసీస్ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. ‘అకాడమీలో రెండుసార్లు మెక్‌గ్రాత్ సర్‌తో మాట్లాడా. ఇది అదృష్టంగా భావిస్తున్నా.
 
  బౌలింగ్‌లో విలువ కట్టలేని ఎన్నో మెలకువలను నేర్పాడు. అవుట్ స్వింగర్లు వేయడం నా బలం. ఈ ఘనత అందుకున్నందుకు గర్వంగా ఉంది. అయితే మా జట్టు గెలిస్తే బాగుండేది. శుక్రవారమే ఐదు వికెట్లు తీశా. అయితే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీస్తానని మాత్రం అనుకోలేదు. 8వ వికెట్ తీసినప్పుడు దీని గురించి ఆలోచన కలిగింది. చివరకు 10వ వికెట్ తీసినప్పుడు గొప్ప అనుభూతి అనిపించింది. అంపైర్లు మ్యాచ్ బంతితో పాటు సావనీర్‌ను అందజేశారు. వీటిని భద్రంగా దాచుకుంటా’ అని కరణ్ తెలిపాడు.
 
 రైల్వేలో ఉద్యోగం
 న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజిలో బీఏ చదువుతున్న కరణ్.. ఇండియన్ రైల్వేస్‌లో పూర్తిస్థాయి ఉద్యోగి. ‘రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యా. కానీ దాని గురించి ఇప్పుడే ఆలోచించడం బాగుండదు. రంజీ ట్రోఫీలో ఆడటం నా కల. నేను ఆడుతున్న మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం నా కర్తవ్యం’ అని ఈ యువ బౌలర్ వ్యాఖ్యానించాడు. కరణ్ ప్రదర్శన పట్ల రైల్వేస్ చీఫ్ కోచ్ అభయ్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు.
 
 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (భారత్)
 
 ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 79 మంది ఈ ఘనత సాధించారు.
 
 భారత్‌లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌లో పది వికెట్ల తీశారు.
 

Advertisement
Advertisement