మళ్లీ జో రూట్ నంబర్ వన్ | Sakshi
Sakshi News home page

మళ్లీ జో రూట్ నంబర్ వన్

Published Tue, Oct 27 2015 3:09 PM

మళ్లీ జో రూట్ నంబర్ వన్

దుబాయ్:అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ మరోసారి అగ్రస్థానాన్నిసాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియాతో ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం నంబర్ వన ర్యాంకును కోల్పోయిన రూట్.. రెండు నెలల్లోనే ఆ ర్యాంకును చేజిక్కించుకున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో రూట్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో రూట్ (88 పరుగులు, 71 పరుగులు) రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో జో రూట్ 913 పాయింట్లతో తొలి స్థానానికి ఎగబాకగా, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 910 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

 

ఇదిలా ఉండగా టెస్టు బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ 905 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా 827 పాయింట్లతో తొలిసారి రెండో స్థానాన్ని సాధించాడు. భారత టెస్టు క్రికెట్ విషయానికొస్తే స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్ టెన్ లో నిలిచాడు. అశ్విన్ 760 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. కాగా, టెస్టు జట్లలో దక్షిణాఫ్రికా 125 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (106 పాయింట్లు) రెండో స్థానంలో, ఇంగ్లండ్( 102 పాయింట్లు)మూడో స్థానంలో, 101 పాయింట్లతో  పాకిస్థాన్ నాల్గో స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ కంటే ఒక పాయింట్ తక్కువగా ఉన్న టీమిండియా(100 పాయింట్లు)  ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

Advertisement
Advertisement