బ్యాడ్మింటన్ లీగ్‌లోకి సచిన్ | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ లీగ్‌లోకి సచిన్

Published Thu, Dec 8 2016 11:33 PM

బ్యాడ్మింటన్ లీగ్‌లోకి సచిన్ - Sakshi

పీబీఎల్‌లో ‘బెంగళూరు బ్లాస్టర్స్’ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు
భాగస్వాములుగా నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్  

 
బెంగళూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ అడుగు పెట్టారు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ సహ యజమానిగా ఉన్న ఆయన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు బ్లాస్టర్స్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నారు. ‘ఫిట్‌నెస్, నైపుణ్యత, చురుకుదనం కలబోతే బ్యాడ్మింటన్. బెంగళూరు బ్లాస్టర్స్‌లో భాగం అవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. వచ్చే సీజన్‌లో ఈ జట్టు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తెలిపారు. మరోవైపు ఈ ఒప్పదం వివరాలను సహ యజమాని, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించారు.

‘సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నేను కలిసి ఓ బృందంగా ఏర్పడి బెంగళూరు జట్టులో పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతానికై తే ఆ మొత్తం ఎంత అనేది చెప్పలేం. కానీ సరైన సయమంలో వెల్లడిస్తాం’ అని నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. అంతగా విజయవంతం కాని బ్యాడ్మింటన్ లీగ్‌లో ప్రవేశించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. క్రీడల్లో అడుగుపెట్టే ప్రతీ పెట్టుబడిదారులకు ఇలాంటి సవాళ్లు మామూలేనని, అరుుతే  తాము లాభాల కోసమే ఇందులో అడుగుపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో బ్యాడ్మింటన్ ప్రమాణాలను మరింత పెంచే ఉద్దేశంతోనే దీంట్లోకి వచ్చినట్టు ఆయన చెప్పారు.

లీగ్‌లో సచిన్ అడుగుపెట్టడం ఆటగాళ్లకు ప్రేరణగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని జాతీయ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో సినీ హీరో అల్లు అర్జున్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా పాల్గొన్నారు. పీబీఎల్ జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతుంది.

Advertisement
Advertisement