మోతెక్కిపోయిన సోషల్ మీడియా | Sakshi
Sakshi News home page

మోతెక్కిపోయిన సోషల్ మీడియా

Published Thu, Mar 24 2016 8:23 AM

మోతెక్కిపోయిన సోషల్ మీడియా - Sakshi

దాదాపు అర్ధరాత్రి వరకు జరిగిన మ్యాచ్.. తెల్లవారుజామునే లేచి విధులకు హాజరు కావల్సిన వాళ్లు సైతం అప్పటివరకు మేలుకొనే ఉన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా!! అవును, టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా మ్యాచ్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చూశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. గేమ్ చాలా థ్రిల్లింగా ఉందంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు. చాలా సంతోషంగా ఉందని, బంగ్లాదేశ్ కూడా బాగా ఆడిందని అన్నారు. అయితే, ఈ మ్యాచ్ మనందరికీ ఒక సందేశం ఇస్తోందని గుర్తు చేశారు. ఎప్పుడూ అంతా అయిపోయిందని వదిలిపెట్టేయకూడదని, జీవితం ఏ క్షణంలోనైనా ఏ మలుపైనా తీసుకోవచ్చని.. ఆశే మనకు విజయాన్ని తీసుకొస్తుందని చెప్పారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు టీమిండియాను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తారు. మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందన్న దశలో.. ఆ మూడు బంతులలో మూడు వికెట్లు పడగొట్టి, కెప్టెన్సీ సామర్థ్యం అంటే ఏంటో, వ్యూహాలు ఎలా ఉంటాయో చూపించిన మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికి ఎత్తేశారు. ట్విట్టర్ వరుసపెట్టి మోగుతూనే ఉంది. ఫేస్‌బుక్ పేజీలు నిండిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ క్రికెట్ ఫొటోలే. సోషల్ మీడియా టీమిండియాకు హారతి పట్టింది. ఈ విజయంలో పాలుపంచుకున్న క్రికెటర్లు కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత మొబైల్ ఫోన్లు పట్టుకుని తమ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మ్యాచ్‌తో చాలా మజా వచ్చిందని, ఇప్పటివరకు ఇలాంటి మ్యాచ్ తనకు అనుభవంలోకి రాలేదని, అద్భుతంగా ఉందని చివరి మూడు బంతుల్లో ఒక క్యాచ్ పట్టిన శిఖర్ ధావన్ అన్నాడు. టీమ్ ఎఫర్ట్ చాలా బాగుందంటూ హిందూస్థాన్ జిందాబాద్ అని ట్వీట్ చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కొంత పెద్దమనిషి తరహాలో స్పందించాడు. బంగ్లాదేశ్ కూడా చాలా అద్భుతమైన క్రికెట్ ఆడిందంటూ వాళ్లనూ ప్రశంసించాడు. చాలా అలసిపోయినట్లు అనిపిస్తోందని, అదే సమయంలో చివరి వరకు అంతా చాలా బాగా ఆడినందుకు సంతోషంగా కూడా ఉందని తన ట్వీట్‌లో వెల్లడించాడు.

ఇక సామాన్య ప్రేక్షకులు కూడా బంగ్లాదేశ్, టీమిండియాల గురించి తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు. ఈ మ్యాచ్ ప్రధానంగా రెండు పాఠాలు నేర్పిస్తోందని, గెలిచేవరకు సంబరాలు చేసుకోకూడదు.. అంతా అయిపోయేవరకు వదిలిపెట్టకూడదు అనేందుకు ఈ మ్యాచే నిదర్శనమని పలువురు అన్నారు. ముఖ్యంగా ముష్ఫిఖర్ రహీమ్ ఒక ఫోర్ కొట్టగానే తాను మొత్తం మ్యాచ్ గెలిచేసినట్లు సంబరాలు చేసుకుంటున్న ఫొటోను, కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చాలా కూల్‌గా వికెట్ల వెనక ఉన్న ఫొటోను చూపించి ఈ వ్యాఖ్యానాలు చేశారు.

 

Advertisement
Advertisement