ఇంతకీ... ఎవరా అథ్లెట్‌? | Sakshi
Sakshi News home page

ఇంతకీ... ఎవరా అథ్లెట్‌?

Published Thu, May 25 2017 1:15 AM

Someone Athlete Doping

న్యూఢిల్లీ: ఓ డోపీ ఉదంతం భారత క్రీడావర్గాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. అతను అగ్రశ్రేణి అథ్లెట్‌ అని... 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్, ఇంచియోన్‌ ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నాడని వెల్లడికావడంతో ఎవరా అథ్లెట్‌ అనే ఆసక్తి పెరిగింది. ఓ భారత మేటి అథ్లెట్‌ నిషిద్ధ ఉత్ప్రేరకం మెల్డోనియం తీసుకున్నాడని తేలడంతో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సదరు అథ్లెట్‌పై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ విషయాన్ని ‘నాడా’ డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ ధ్రువీకరించారు.

సోమవారమే ఆ అథ్లెట్‌పై వేటు పడిందని అయితే అతని పేరు చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ప్రస్తుతం పాటియాలాలోని జాతీయ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఎస్‌)లో శిక్షణ తీసుకుంటున్న అతని గదిలో 20కి పైగా సిరంజీలు లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. కొందరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకుంటున్నారనే సమాచారం అందడంతో ‘నాడా’ అధికారులు దాడి చేసి మెల్డోనియం ఉత్ప్రేరకాన్ని, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అథ్లెట్లంతా రోజువారీ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.

ఆ అథ్లెట్‌ను వెంటనే క్యాంపు నుంచి పంపించి వేయాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్యకు తెలిపామని నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. మెల్డోనియంను ‘వాడా’ 2015 సెప్టెంబర్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో చేర్చింది. ఈ విషయం తెలియని రష్యా టెన్నిస్‌ స్టార్‌ షరపొవా అది తీసుకోవడంతో 15 నెలలు సస్పెండై... ఇటీవలే మళ్లీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement