పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ  | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ 

Published Tue, Jun 23 2020 12:02 AM

Three Cricket Players Tested Positive Of Coronavirus - Sakshi

కరాచీ: మరో వారం రోజుల్లో ఇంగ్లండ్‌ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు షాక్‌ తగిలింది. ఈ సిరీస్‌ కోసం ఎంపికైన 29 మంది పాక్‌ క్రికెటర్లలో కొందరికి కోవిడ్‌–19 టెస్టులు నిర్వహించగా... జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారిన పడినట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. యువ ఆటగాడు హైదర్‌ అలీతోపాటు షాదాబ్‌ ఖాన్, హారిస్‌ రవూఫ్‌లకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్‌ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం రావల్పిండిలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తేలింది. వెంటనే  స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన క్రికెటర్లను పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

అయితే పరీక్షల ముందు వరకు వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఈ ముగ్గురితో పాటు ఇమాద్‌ వసీమ్, ఉస్మాన్‌ షిన్వారీలనూ పరీక్షించగా వారి ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని పీసీబీ వెల్లడించింది. మరోవైపు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త, ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్, కోచ్‌ వకార్‌ యూనిస్‌లతోపాటు కొంతమంది జట్టు అధికారులు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షలకు హాజరయ్యారు వీరి ఫలితాలు నేడు వచ్చే అవకాశముందని పీసీబీ తెలిపింది. ఇప్పటికే పాక్‌ మాజీ క్రికెటర్లు తౌఫిక్‌ ఉమర్, షాహిద్‌ అఫ్రిదిలు కరోనా బారిన పడ్డారు. 

Advertisement
Advertisement