త్రిపుర...అదే జోరు! | Sakshi
Sakshi News home page

త్రిపుర...అదే జోరు!

Published Sun, Dec 8 2013 1:57 AM

త్రిపుర...అదే జోరు! - Sakshi

 సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరాలన్న హైదరాబాద్ ఆశలకు త్రిపుర గండి కొట్టేటట్లే కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో అన్నింటికంటే బలహీన జట్టుగా ఉన్న త్రిపుర తొలి రోజు ఆటతీరును కొనసాగిస్తూనే కాస్త దూకుడు కూడా జోడించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 588 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కెప్టెన్ యోగేశ్ టకవాలే (400 బంతుల్లో 212; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించగా... వెటరన్ అబ్బాస్ అలీ (196 బంతుల్లో 105 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. శనివారం తీవ్రంగా శ్రమించినా హైదరాబాద్ బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.
 మారని బౌలింగ్
 285/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన త్రిపుర కొద్దిసేపటికే మురా సింగ్ (225 బంతుల్లో 150; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) వికెట్ కోల్పోయింది. మరో పది పరుగులు మాత్రమే జోడించిన అతను, రవికిరణ్ బౌలింగ్‌లో రవితేజకు క్యాచ్ ఇవ్వడంతో 206 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అభిజిత్ డే (12) కూడా వెంటనే వెనుదిరిగాడు. అయితే సీనియర్ బ్యాట్స్‌మన్ అబ్బాస్ అలీ అండతో టకవాలే చెలరేగిపోయాడు. 218 బంతుల్లో కెరీర్‌లో తన నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతటితో ఈ జోడి తమ జోరును ఆపలేదు. హైదరాబాద్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఈ క్రమంలో టకవాలే 150 మార్క్‌ను అందుకోగా...అలీ అర్ధ సెంచరీ పూర్తయింది. మూడో సెషన్‌లో త్రిపుర వేగం పెంచింది. 380 బంతుల్లో డబుల్ సెంచరీ చేరుకున్న యోగేశ్, 204 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో అక్షత్‌కు క్యాచ్ ఇచ్చినా... థర్డ్ అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. అయితే ఆ వెంటనే రవితేజ బౌలింగ్‌లో  బౌల్డ్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొద్ది సేపటికే అచర్జీ (16) అవుటైనా...178 బంతుల్లో కెరీర్‌లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్న అబ్బాస్ అజేయంగా నిలిచాడు.
 స్పోర్టింగ్ వికెట్‌ను కాదని...
 హైదరాబాద్ కోచ్ సునీల్ జోషి అంచనా తప్పింది. ధర్మశాలలో హిమాచల్‌ప్రదేశ్‌పై ఘన విజయంతో తమ బ్యాట్స్‌మెన్‌ను ఆయన అమితంగా నమ్మినట్లుంది. అందుకే పిచ్ క్యురేటర్‌తో వాదించి మరీ బ్యాటింగ్ వికెట్‌ను సిద్ధం చేయించినట్లు తెలిసింది. వాస్తవంగా చూస్తే మన జట్టు బ్యాటింగ్ ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నా అద్భుతమైన లైనప్ ఏమీ కాదు. జట్టులో ఒక్క అంతర్జాతీయ ఆటగాడు కూడా లేడు. ఈ మ్యాచ్ కోసం క్యురేటర్ రెండు వికెట్లు సిద్ధం చేశారు. కోచ్‌గా తన జట్టు బలాలు, బల హీనతలు బాగా తెలిసిన జోషి, తనకు అసలు ఎలాంటి పిచ్ కావాలనే విషయంపై చివరి వరకు కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు. అయితే టాస్ గెలిస్తే భారీ స్కోరు చేయవచ్చనే ఆశతో బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా సహకరించే వికెట్‌ను కాదని జీవం లేని బ్యాటింగ్ వికెట్‌ను ఎంచుకున్నారు. అనూహ్యంగా త్రిపుర దీనిపై పండుగ చేసుకుంది. రెండు రోజుల ఆట పూర్తయినా త్రిపుర ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నాలుగు వికెట్లతో ఆ జట్టు మూడో రోజు  కనీసం లంచ్ వరకు ఆడవచ్చు. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రా వైపే మొగ్గు చూపిస్తున్నా... మిగిలిన ఐదు సెషన్లు ఆడి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం అసాధ్యమే. కాబట్టి ఒక్క పాయింట్‌తో సరి పెట్టుకోవాల్సిందే!

Advertisement

తప్పక చదవండి

Advertisement