వెటెల్ విజయం | Sakshi
Sakshi News home page

వెటెల్ విజయం

Published Mon, Jul 27 2015 1:04 AM

వెటెల్ విజయం

 హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
 సీజన్‌లో రెండో గెలుపు
 హామిల్టన్, రోస్‌బర్గ్‌ల తడబాటు
 ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ

 
 బుడాపెస్ట్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) ఈ సీజన్‌లో రెండో టైటిల్‌ను నెగ్గాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ అద్వితీయ విజయాన్ని నమోదు చేశాడు. 69 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 46 నిమిషాల 09.985 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. క్వియాట్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో జరిగిన గత తొమ్మిది రేసుల్లో ఎనిమిదింట విజయఢంకా మోగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ జోరుకు ఈసారి బ్రేక్ పడింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆఖరికి ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... రోస్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. హుల్కెన్‌బర్గ్ 41వ ల్యాప్‌లో, పెరెజ్ 53వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 23న జరుగుతుంది.
 
 రేసు మొదలైన వెంటనే హామిల్టన్, రోస్‌బర్గ్ లను వెనక్కినెట్టి వెటెల్ ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ గమ్యానికి చేరుకున్నాడు. తన కెరీర్‌లో తొలిసారి హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరంభంలోనే నాలుగో స్థానానికి పడిపోయిన హామిల్టన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తన విజయాన్ని గతవారం మృతి చెందిన ఎఫ్1 డ్రైవర్ జులెస్ బియాంచికి అంకితం ఇస్తున్నట్లు వెటెల్ తెలిపాడు. బియాంచి మృతికి సంతాపంగా ఈ రేసు ప్రారంభానికి ముందు నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ గెలుపుతో వెటెల్ అత్యధిక టైటిల్స్ సాధించిన వారి జాబితాలో అయర్టన్ సెనా (41)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అలైన్ ప్రాస్ట్ (51 టైటిల్స్), మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
 
 డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
 స్థానం    డ్రైవర్    జట్టు    పాయింట్లు
 1    హామిల్టన్    మెర్సిడెస్    202
 2    రోస్‌బర్గ్    మెర్సిడెస్    181
 3    వెటెల్    ఫెరారీ    160
 4    బొటాస్    విలియమ్స్    77
 5    రైకోనెన్    ఫెరారీ    76

 

 కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
 స్థానం    జట్టు    పాయింట్లు
 1    మెర్సిడెస్    383
 2    ఫెరారీ    236
 3    విలియమ్స్    151
 4    రెడ్‌బుల్    96
 5    ఫోర్స్ ఇండియా    39

 

Advertisement
Advertisement