సూపర్ మ్యాన్.. విరాట్ కోహ్లి! | Sakshi
Sakshi News home page

సూపర్ మ్యాన్.. విరాట్ కోహ్లి!

Published Sun, Dec 25 2016 1:35 PM

సూపర్ మ్యాన్.. విరాట్ కోహ్లి!

విరాట్ కోహ్లి.. అసాధారణ ప్రతిభతో చెలరేగిపోతూ ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత సంచలనం. టెస్టుల్లో ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు కొట్టినా, వన్డేల్లో తిరుగులేని యావరేజ్  కల్గినా, టీ 20ల్లో దూకుడును ప్రదర్శించిన అది విరాట్ కే సొంతం. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యంత నిలకడగా రాణించి 'సూపర్ మ్యాన్' తరహా ఆటను తలపించిన క్రికెటర్. 2016 సంవత్సరాన్ని భారత్ బెస్ట్ ప్లేయర్ ట్యాగ్తో ముగించిన క్రికెటర్. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్తో పోల్చదగిన ఏకైక క్రికెటర్. ఈ ఏడాది  అన్ని ఫార్మాట్లలో కలిపి 70.0కి పైగా సగటుతో అభిమానుల్ని మైమరించిన కోహ్లి ఘనతలను ఒకసారి విశ్లేషించుకుందాం.
 

2016లో విరాట్ కోహ్లి రికార్డులు..

ఫార్మాట్            ఇన్నింగ్స్ లు      పరుగులు   అత్యధిక స్కోరు    యావరేజ్          సెంచరీలు     హా్ఫ్ సెంచరీలు
వన్డేలు                10                 739           154 నాటౌట్           92.37                 3                 4
ట్వంటీ20లు         13              641              90                       106.83                0               7
టెస్టులు                18              1215           235                       75.93                  4              2


2016 లో విరాట్ ఖాతాలో చేరిన ఘనతలు

వేగవంతంగా 25 వన్డే సెంచరీలు
వేగవంతంగా 7,500 వన్డే పరుగులు
లక్ష్య ఛేదనలో సచిన్ టెండూల్కర్(14)సాధించిన సెంచరీలు సమం
ఐపీఎల్-2016లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన క్రికెటర్
ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక భారత టెస్టు కెప్టెన్
ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు కొట్టి ప్రపంచ మూడో ఆటగాడు. అంతకుముందు డాన్ బ్రాడ్ మన్, రికీ పాంటింగ్లు ఈ ఘనత సాధించారు
ఒక క్యాలెండర్ ఇయర్లో తొమ్మిది టెస్టు విజయాలు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్
వరుసగా ఐదు టెస్టు సిరీస్ విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్
2011లో రాహుల్ ద్రవిడ్ ఒకే ఏడాది వెయ్యికి పైగా పరుగులు సాధించిన తరువాత ఆ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్.



ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి..

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో విరాట్ కోహ్లి తన రికార్డులకు శ్రీకారం చుట్టాడు. ఆ సిరీస్లో ఐదు వన్డేల్లో విరాట్ రెండు సెంచరీలతో 381 పరుగులు చేశాడు. దాంతో ఆ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సుమారు 76 పరుగుల యావరేజ్ తో మెరిశాడు. అయినప్పటికీ భారత్ జట్టు 1-4 తో సిరీస్ను కోల్పోయింది.

ఆ తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు ట్వంటీల సిరీస్లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించాడు. మూడు ట్వంటీ 20ల్లో వరుసగా 90 నాటౌట్, 59 నాటౌట్, 50 పరుగులు చేసి భారత జట్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంలో సహకరించాడు.

ఆసియా కప్; బంగ్లాదేశ్ పర్యటనలో్ కోహ్లి

ఆసియాకప్ను భారత్ కైవసం చేసుకోవడంలో కోహ్లి పాత్ర వెలకట్టలేనిది. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన ఆసియాకప్ను భారత్ చేజిక్కించుకుంది. ఆ సిరీస్లో కోహ్లి ఐదు మ్యాచ్ల్లో ఒక  హాఫ్ సెంచరీ సాయంతో 76.50 సగుటుతో 153 పరుగులు చేశాడు.

వరల్డ్ టీ 20లో భారత్

వరల్డ్ టీ 20లో భారత్ సెమీ ఫైనల్ వరకూ వెళ్లి చతికిలబడింది. అయితే సెమీస్ చేరడంలో విరాట్ ముఖ్య భూమిక పోషించాడు. ఆ టోర్నీలో 23, 55 నాటౌట్, 24, 82 నాటౌట్, 89 నాటౌట్లతో రాణించిన కోహ్లి.. భారత జట్టును సెమీస్ కు చేర్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో విరాట్ అమోఘమైన ఆటతో చెలరేగాడు. అయితే సెమీస్లో విరాట్ రాణించినా మిగతా సభ్యుల నుంచి సహకారం లేదు. దాంతో వెస్టిండీస్ తో వాంఖేడ్ లో జరిగిన సెమీస్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కోహ్లి 136.50 సగటుతో 273 పరుగులు చేయడం విశేషం.

ఐపీఎల్-2016

ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున 16 మ్యాచ్ల్లో 973 పరుగులు చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆ క్రమంలోనే నాలుగు సెంచరీలు సాధించి సీజన్ రికార్డులను తిరగరాశాడు. అయితే డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్  రైజర్స్ చేతిలో విరాట్ సేన తుది పోరులో ఓడిపోవడంతో టైటిల్ ఆశ ఆవిరైంది.

వెస్టిండీస్ పర్యటనలో విరాట్ సేన

విరాట్ కోహ్లి పగ్గాలు చేపట్టిన తరువాత తొలి విదేశీ పర్యటనకు భారత్ జట్టు.. వెస్టిండీస్  పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్లో నాలుగు టెస్టుల్లో విరాట్ కోహ్లి 62.75 సగుటుతో 251 పరుగులు చేశాడు. ఆ సిరీస్ తొలి టెస్టులోనే కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. ఆంటిగ్వా లో జరిగిన ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి డబుల్ తో ఆకట్టుకున్నారు. దాంతో ఆ టెస్టును భారత జట్టు ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలిచి బోణి కొట్టింది. ఇలా విజయంతో  సిరీస్ ఆరంభించిన కోహ్లి సేన 2-0 తో విండీస్ను మట్టికరిపించింది.

భారత్  లో న్యూజిలాండ్ పర్యటన

విండీస్ పర్యటనలో డబుల్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. న్యూజిలాండ్ తో సిరీస్లో కూడా అదే జోరును కొనసాగించాడు. మూడు టెస్టుల సిరీస్లో 51.50 సగటుతో 309 పరుగులు చేశాడు. తొలి రెండు టెస్టులో విఫలమైన కోహ్లి.. ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో పరుగుల దాహం తీర్చుకున్నాడు. న్యూజిలాండ్ పై 211 వ్యక్తిగత పరుగులు సాధించాడు. తద్వారా ఒకే ఏడాదిలో  రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు. కోహ్లికి తోడు పూజారా, రహానేలు రాణించడంతో పాటు, బౌలింగ్ లో అశ్విన్ మెరవడంతో న్యూజిలాండ్ తో సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తరువాత న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్లో కోహ్లి 119. 33 సగటుతో 358 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు నమోదు సిరీస్ను 3-2 తో గెలవడంలో కోహ్లి పాత్ర వెలకట్టలేనిది.


భారత్ లో ఇంగ్లండ్ పర్యటన

ఇంగ్లండ్ తో్ జరిగిన ఐదు టెస్టుల  సిరీస్లోనూ కోహ్లి దూకుడును ప్రదర్శించాడు. 109.16 సగటుతో 655 పరుగులను సాధించాడు. తద్వారా ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ 4-0 తో టెస్టు సిరీస్ ను గెలిచింది. తద్వారా వరుసగా విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత్ ఐదో సిరీస్ విజయాన్ని సాధించింది.

Advertisement
Advertisement