ఆరోగ్యమే మహాభాగ్యం | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాభాగ్యం

Published Sun, Dec 15 2013 1:20 AM

ఆరోగ్యమే మహాభాగ్యం

న్యూఢిల్లీ: చిన్నారులు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వీడియోగేమ్స్, మొబైల్ ఫోన్లలో ఆడటం మాని, మైదానాల్లోకి వచ్చి ఆడుకోవాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. కష్టించి పని చేస్తే ఏ కల అయినా సాకారమవుతుందన్నాడు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఎన్‌డీటీవీ ‘25 గ్రేటెస్ట్ గ్లోబల్ లివింగ్ ఇండియన్స్’ అవార్డును సచిన్ అందుకున్నాడు. కపిల్ దేవ్, లియాండర్ పేస్‌లకు కూడా ఈ పురస్కారం లభించింది.
 
 
 ఈ సందర్భంగా మాస్టర్ మాట్లాడుతూ... ‘భారత యువతరాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నా. వాళ్ల కలలు నిజమవ్వాలంటే కష్టపడి పని చేయడమొక్కటే మార్గం. నాకు కూడా కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. అయితే వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇది చాలా ప్రధానం కూడా. ఓడిన ప్రతిసారీ మరో సవాలుకు సిద్ధంగా ఉండేవాణ్ణి. ఈ అవార్డు స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఏదైనా మెసేజ్ ఇవ్వాలని కోరినప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెబుతుండేది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.

అవుట్‌డోర్ ఆటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిట్‌గా ఉండాలని యువతకు సూచించాడు. అదే సమయంలో తమకిష్టమైన వాటిపై దృష్టిపెట్టాలన్నాడు. ‘ప్రస్తుతం యువత మొత్తం వీడియో గేమ్స్, ల్యాప్‌టాప్, కంపూటర్స్, మొబైల్స్‌తోనే ఎక్కువగా కనిపిస్తోంది. వీటివల్ల కేవలం వేళ్లకు మాత్రమే ఎక్సర్‌సైజ్ లభిస్తుంది. కాబట్టి చిన్నారులూ అవుట్ డోర్ ఆటలకు ప్రాధాన్యమివ్వండి. స్నేహితులతో పోటీపడుతూ కొన్ని రకాల క్రీడలపై ఆసక్తి పెంచుకోండి. ఇది మంచి ఫిట్‌నెస్, ఆరోగ్యం, పూర్తిస్థాయి ఏకాగ్రతకు సహకరిస్తుంది. జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారో దానిపై ఎక్కువగా దృష్టిసారించండి’ అని మాస్టర్ సూచించాడు.
 

Advertisement
Advertisement