యువీ ఎక్కడ.. ఫ్యాన్స్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

యువీ ఎక్కడ.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Mon, Oct 2 2017 12:08 PM

yuvraj_singh

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్‌కు వెటరన్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టి20 మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మేస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో యువరాజ్‌ పేరు లేకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు.

మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఇంకా యువీలో ఉందని, అతడిని ఎంపిక చేయకపోవడం సమంజసం కాదని ట్విటర్‌లో పలురకాల కామెంట్లు పోస్ట్‌ చేశారు. పొట్టి ఫార్మాట్‌లో అతడు సాధించిన ఘనతలు మర్చిపోయారా అంటూ చురకలు అంటించారు. క్రికెటర్ల ఫిట్ నెస్ కు సంబంధించి నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించే యో -యో టెస్టులో దినేశ్ కార్తీక్, ఆశిష్ నెహ్రాలు పాసయ్యారా?అంటూ మరొక అభిమాని ప్రశ్నించాడు. ఎటువంటి పరీక్ష లేకుండానే వారిని ఎంపిక చేశారనేది సదరు అభిమాని ప్రశ్న. మరి అటువంటప్పుడు యువీ, రైనాలను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు. ఇక్కడ యువీతో పాటు సురేశ్‌ రైనా, అశ్విన్‌, జడేజా, రహానే, మహ్మద్‌ షమిలకు కూడా టి20 జట్టులో స్థానం దక్కలేదు. 38 ఏళ్ల వెటరన్‌ పేసర్‌ అశిష్‌ నెహ్రాకు జట్టులో చోటు కల్పించారు. టి20 స్పెషలిస్ట్‌ అయిన సురేశ్‌ రైనాను ఎంపిక చేయకపోవడం పట్ల కూడా అభిమానులు కామెంట్లు పెట్టారు.

Advertisement
Advertisement