‘ ఆ ఒక్క’ స్థానంలో ఎవరు? | Sakshi
Sakshi News home page

‘ ఆ ఒక్క’ స్థానంలో ఎవరు?

Published Fri, Feb 5 2016 12:11 AM

‘ ఆ ఒక్క’ స్థానంలో ఎవరు?

అజింక్య రహానే, మనీశ్ పాండే మధ్య పోటీ
టి20 ప్రపంచకప్‌కు నేడు భారత జట్టు ఎంపిక
ఆసియా కప్ టోర్నీకి కూడా

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లోనే భారత జట్టు కూర్పుపై ఒక అంచనా వచ్చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మార్పు కూడా లేకుండా అదే 11 మంది ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. కెప్టెన్ ధోని కూడా దాదాపు ఇదే టీమ్ అంటూ ప్రస్తుత సభ్యులకే తన ఓటు వేశాడు. కాబట్టి సొంతగడ్డపై జరిగే టి20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఎంపికలో ఎలాంటి సంచలనాలకు పెద్దగా అవకాశం లేదు. ఆసీస్‌ను చిత్తు చేసిన టీమ్‌పై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసేందుకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు (శుక్రవారం) ఇక్కడ సమావేశమవుతోంది. పనిలో పనిగా ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే జట్టును కూడా ప్రకటిస్తారు. అయితే బంగ్లాదేశ్  పరిస్థితులకు, భారత్‌కు పెద్దగా తేడా ఉండకపోవడం, ఈసారి ఆసియా కప్ ఫార్మాట్ కూడా టి20 కావడంతో రెండు వేర్వేరు జట్లు కాకుండా ఒకే టీమ్‌ను రెండింటికీ ఎంపిక చేసే అవకాశం ఉంది.

కుర్రాళ్లు ఖాయం...
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లలో బరిలోకి దిగిన జట్టులో రెగ్యులర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ధోని మద్దతును బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ స్థానానికి కూడా వచ్చిన ప్రమాదమేమీ లేదు. తమ ప్రదర్శనతో కొత్త కుర్రాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తమ స్థానాలు ఖాయం చేసుకున్నారు. ఆశిష్ నెహ్రాపై కూడా మేనేజ్‌మెంట్‌కు నమ్మకముంది. అయితే ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికైన జట్టులో అజింక్య రహానే, మనీశ్ పాండేలు ఇద్దరూ ఉన్నారు. విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో పాండేకు అవకాశం దక్కింది.

అయితే ఇప్పుడు ప్రపంచకప్ కోసం ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు తప్పుకోవాల్సిన పరిస్థితి. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్‌లలో రహానే నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగా, ఇటీవలి సిడ్నీ వన్డే ఇన్నింగ్స్, టి20 శైలి బ్యాటింగ్ పాండేకు ఉన్న అనుకూలతలు. చివరి ఓవర్లలో రహానే హిట్టింగ్ సామర్థ్యంపై స్వయంగా ధోనికే సందేహాలు ఉన్నా... ఒక జూనియర్ కోసం అతడిని ఉన్నపళంగా పక్కన పెడతారా అనేది సందేహమే.

ఇర్ఫాన్ పఠాన్ ఆశలు...
ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో కొత్త ఆటగాడు పవన్ నేగి కూడా ఉన్నాడు. అతడిని ఇదే సిరీస్ వరకు పరిమితం చేస్తే ఆ స్థానంలో మరో ఆటగాడికి వరల్డ్ కప్ అవకాశం ఉంది. నెహ్రా ఫిట్‌నెస్‌పై కాస్త సందేహం ఉండటంతో మరో లెఫ్టార్మ్ సీమర్‌ను ఎంపిక చేయవచ్చు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబర్చిన ఇర్ఫాన్ పఠాన్ ఆ స్థానం ఆశిస్తున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉంటే మొహమ్మద్ షమీ తిరిగొచ్చే అవకాశం కూడా ఉంది.

Advertisement
Advertisement