ఆ ఘనత ధోనిదే | Sakshi
Sakshi News home page

ఆ ఘనత ధోనిదే

Published Thu, Feb 19 2015 12:42 AM

ఆ ఘనత ధోనిదే

 జట్టులో అందరితో వ్యక్తిగతంగా మాట్లాడాడు
 యువరాజ్ పాత్ర ఈసారి నేను పోషిస్తా
 సురేశ్ రైనా ఇంటర్వ్యూ
 

 ముక్కోణపు వన్డే టోర్నీలో భారత జట్టు ఆటతీరుకు... ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆటతీరుకు అసలు పోలికే లేదు. అదే వేదిక... అదే ఆటగాళ్లు... మరి ఇంత మార్పు ఎలా సాధ్యమైంది. అంతకు ముందు ప్రతి మ్యాచ్‌లోనూ ఇబ్బంది పడ్డ రైనా... ఆ మ్యాచ్‌లో ఎలా చెలరేగాడు? దీనికి సమాధానం చెబుతున్న సురేశ్ రైనా ఇంటర్వ్యూ....
 
 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాక్‌పై విజయం. ఇంతకంటే మంచి ఆరంభం ఉండదేమో?
 అవును. పాక్‌తో ఎప్పుడు ఆడినా ఒత్తిడి ఉంటుంది. ఇది నా రెండో ప్రపంచకప్. రెండోసారి కూడా గెలిచాం. ఈ రికార్డు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. పాక్‌పై విజయంతో మాకు మంచి ఆరంభం లభించింది. మిగిలిన మ్యాచ్‌లూ బాగా ఆడాలని కోరుకుంటున్నాం.
 
 ఈ మ్యాచ్‌కు ముందు జట్టు ఆత్మస్థైర్యం ఎలా ఉంది?
 గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలో మేం గడ్డుకాలం ఎదుర్కొన్నాం. వార్మప్ మ్యాచ్‌ల తర్వాత విశ్రాంతి తీసుకున్నాం. ఆ తర్వాత ధోని జట్టులోని ప్రతి ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడాడు. జట్టులో ఆయా ఆటగాళ్ల బాధ్యత ఏమిటో వివరించాడు. ప్రతి ఆటగాడి దగ్గరకి వెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడి స్ఫూర్తి నింపడం అనేది అద్భుతమైన ప్రక్రియ. ఇది అందరిలోనూ చాలా మార్పు తెచ్చింది. కాబట్టి జట్టును గాడిలో పెట్టిన ఘనత ధోనిదే.
 
 పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో ఉన్నారా?
 మ్యాచ్ ఆరంభానికి ముందు కాస్త ఒత్తిడిలోనే ఉన్నాను. కానీ క్రీజులోకి వెళ్లే సమయంలో ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎందుకంటే ఆ జట్టులోని ఇర్ఫాన్, రియాజ్, ఆఫ్రిదిల బౌలింగ్‌లో గతంలో నేను ఆడా ను. కాబట్టి ఆత్మవిశ్వాసంతోనే బ్యాటింగ్‌కు వెళ్లాను.
 
 నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వెళ్లాలనేది ముందుగా అనుకున్న వ్యూహమేనా?
 తొలి వికెట్ పడిన తర్వాత ధోని పిలిచి ప్యాడ్లు కట్టుకోమన్నాడు. ధావన్ అవుట్ కాగానే నన్ను వెళ్లమన్నాడు. పాక్ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు, ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నందున... క్రీజులో ఒక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండాలి. అందుకే నన్ను ప్రమోట్ చేశారు. నేను 15-20 బంతులు ఆడి క్రీజులో కుదురుకున్నాక అటాక్ చేయాలని భావించాను. కోహ్లి, నేను సింగిల్స్ బాగా తీయడం వల్ల పాక్ బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో కష్టపడటం వల్లే పాక్‌తో మ్యాచ్‌లో బంతిని బాగా బాదగలిగాను. టోర్నీలో ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా.
 
 ఈసారి పవర్‌ప్లేలో చాలా తక్కువ పరుగులు చేశారు. వికెట్లు ఉన్నా జాగ్రత్తగా ఆడటానికి ఏదైనా కారణం ఉందా?
 పవర్‌ప్లే అనేది లాటరీ కాదు. మ్యాచ్ ఏ దశలో అయినా షాట్ సెలక్షన్ చాలా ముఖ్యం. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఈ విషయంలో ధోని, యువరాజ్‌ల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గత ప్రపంచకప్‌లో యువరాజ్ చాలా మ్యాచ్‌ల్లో చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. మ్యాచ్‌లు గెలిపించాడు. ఈసారి ఆ పాత్ర నేను పోషించాలని అనుకుంటున్నాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ యువీ స్థానాన్ని భర్తీ చేస్తా.  
 

Advertisement
Advertisement